Viral Video: వీడియో ఇదిగో.. ప్రధాని మోదీ కంచుకోట వారణాసిలో చెరువులా మారిన రోడ్లు.. వరద నీటిలో ఆటో, బైక్ బోల్తా.. స్మార్ట్ సిటీ వాటర్‌లాగింగ్‌పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్..
ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసి నగరం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైంది. వరుసగా రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల ధాటికి నగరంలోని దాదాపు 22 ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో రోడ్లు చెరువులను తలపించాయి. నిలిచిన నీటి కారణంగా ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజాగా నగరంలోని ఒక ముంపు ప్రాంతంలో నీటిలో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల్లోనే అదే నీటి గుంతలో ఒక బైకర్ కూడా బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయాడు. ఈ ఘటనల్లో ప్రయాణికులకు, డ్రైవర్లకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నగర పాలక వ్యవస్థ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
Flooded Roads in Varanasi Cause Chaos; Auto and Bike Overturn
స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్న వారణాసిలో ప్రతిసారీ స్వల్ప వర్షానికే డ్రైనేజీ వ్యవస్థ విఫలమై రోడ్లు మునిగిపోవడంపై నెటిజన్లు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టి ఉండే ఈ నగరంలో మౌలిక వసతుల లోపాలు, సరైన పట్టణ ప్రణాళిక లేకపోవడంపై రాజకీయంగానూ తీవ్ర చర్చ నడుస్తోంది.