IPL Auction 2025 Live

'Apple' of Discord: ఆపిల్ ఫోన్ ఆర్డర్ ఇస్తే.. ఆపిల్ డ్రింక్ వచ్చింది! పార్సెల్ తెరిచి బిత్తిరైపోయిన యువతి, విచారం వ్యక్తం చేసిన సెల్లర్స్, పోలీస్ కేసు నమోదు

తాజాగా మార్కెట్లో విడుదలైన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్‌ను కొనుగోలు చేసేందుకు లీయూ (Liu) అనే చైనీస్ మహిళ ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ నుంచే ఆర్డర్ చేసింది. ఇందుకోసం ఆమె 1500 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు 1 లక్షా 10 వేల రూపాయలు) కంపెనీకి చెల్లించింది. ఇక అనుకున్న సమయానికే ఆమెకు తన ఆర్డర్ డెలివరీ చేయబడింది. అయితే...

Apples- Image used for representational purpose only | (Photo Credit: PTI)

Beijing, March 1 : ఆన్‌లైన్ మోసాల గురించి నిత్యం ఎన్నో సంఘటనలు మన దృష్టికి వస్తుంటాయి, ముఖ్యంగా ఆన్‌లైన్‌లో మొబైల్ ఆర్డర్ ఇస్తే సబ్బు బిల్లలు, అగ్గిడబ్బలు, చాక్లెటు రావడం లాంటి వార్తలు మనం చాలా సార్లే వినుంటం. అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ యువతి ఆన్‌లైన్‌లో ఆపిల్ ఫోన్ ఆర్డర్ ఇస్తే ఆమెకు ఆపిల్ డ్రింక్ వచ్చిందట.

ఆ వివరాల్లోకి వెళ్తే.. తాజాగా మార్కెట్లో విడుదలైన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్‌ను కొనుగోలు చేసేందుకు లీయూ (Liu) అనే చైనీస్ మహిళ ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ నుంచే ఆర్డర్ చేసింది. ఇందుకోసం ఆమె 1500 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు 1 లక్షా 10 వేల రూపాయలు) కంపెనీకి చెల్లించింది. ఇక అనుకున్న సమయానికే ఆమెకు తన ఆర్డర్ డెలివరీ చేయబడింది.

అయితే తనకు వచ్చిన పార్సెల్‌ను లీయూ ఎంతో ఉల్లాసంతో.. ఉత్సాహంతో తెరిచిచూడగా, తన కళ్లు బైర్లు కమ్మాయి. ఒక్కసారిగా అందులో ఉన్న ప్రొడక్టును చూసి ఆమె ఖంగుతింది. అందులో తాను ఊహించిన ఆపిల్ ఫోన్‌కు బదులుగా, ఊహించని వస్తువు- ఆపిల్ యోగర్ట్ డ్రింక్ టెట్రా ప్యాక్ ఉంది.

దీంతో ఆ యువతి ఐఫోన్ సంస్థను మరియు డెలివరీ సర్వీస్ వారిని సంప్రదించింది. అయితే వారు మాత్రం లీయూ ఆర్డర్ చేసిన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్‌నే పంపించినట్లు స్పష్టం చేశాయి. వారి జవాబుతో సంతృప్తి చెందని లీయూ తనకు ఐఫోన్ రాలేదని, అందులో ఆపిల్ డ్రింక్ మాత్రమే ఉందని, అదీకాక డెలివరీ కూడా నేరుగా తన చేతికి ఇవ్వకుండా తమ నివాసంలోని మెయిల్ బాక్సులో వేశారని వాపోయింది. అంతటితో ఆగకుండా లీయూ తనకు జరిగిన మోసాన్ని  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో స్పందించిన ఎక్స్‌ప్రెస్ మెయిల్ డెలివరీ సర్వీసు వారు లీయూ ఫిర్యాదుని స్వీకరించామని, తమ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లను విచారిస్తున్నట్లు పేర్కొంది. అటు ఆపిల్ సంస్థ కూడా ఇంటర్నల్ ఇంక్వైరీ ప్రారంభించినట్లు పేర్కొంది.

మరి ఆ తర్వాత ఏం జరిగిందో? చివరకు లీయూకి ఐఫోన్ లభిస్తుందా? లేదా ఆ ఆపిల్ డ్రింక్ తోనే సరిపెట్టుకుంటుందా చూడాలి.  ఏదైమైనా ఆన్‌లైన్‌లో ఏదైనా ఖరీదైనది ఆర్డర్ చేసేటపుడు కొంత జాగ్రత్త వహించాలి. వీలైనంత వరకు 'క్యాష్ ఆన్ డెలివరీ' ఆప్షన్ ఎంచుకుంటే మేలు.