Bengal CM Mamata Banerjee: బీజేపీని గద్దె దించడానికి అందరం ఏకమవుదాం, ప్రతిపక్షాలకు, బీజేపీ రహిత రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
ఆదివారం ఆ లేఖను రిలీజ్ చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, ఈ విషయంలో పోరాటం చేపట్టేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ఆదివారం ఆ లేఖను రిలీజ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసేందుకు బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుతున్నట్లు లేఖలో ఆమె ఆరోపించారు. ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆ సమయంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోందన్నారు.
అందరికీ అనుకూలమైన ప్రదేశంలో ఈ అంశం గురించి చర్చిచేందుకు రావాలని, దేశంలోని ప్రగతిశీల పార్టీలు ఒక్కటిగా నిలిచి అణిచివేత దళాన్ని అడ్డుకోవాలన్నారు. బొగ్గు కుంభకోణం కేసులో మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిశేక్ బెనర్జీపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈడీ, సీబీఐ, సీవీసీ, ఐటీ శాఖలను విపక్షాలపై ప్రతీకారంతో బీజేపీ వాడుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. రాజకీయాల జోక్యం వల్లే ప్రజలకు న్యాయం జరగడంలేదని ఆమె లేఖలో అన్నారు.