World Cup 2023, AUS vs NZ: న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం, 5 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపు, చివరి ఓవర్లో ఉత్కంఠగా మారిన మ్యాచ్..

హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లిన కంగారూ జట్టును న్యూజిలాండ్‌ భయపెట్టింది. 388 పరుగుల భారీ స్కోరు చేసిన తర్వాత కూడా ఆస్ట్రేలియా చెమటోడ్చి 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.

australia

ప్రపంచ కప్ 27వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మధ్య హోరాహోరీగా తలపడ్డాయి. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లిన కంగారూ జట్టును న్యూజిలాండ్‌ భయపెట్టింది. 388 పరుగుల భారీ స్కోరు చేసిన తర్వాత కూడా ఆస్ట్రేలియా చెమటోడ్చి 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కంగారూ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. డేవిడ్ వార్నర్ 81 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ కేవలం 67 బంతుల్లో 109 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ ఆడిన ​​ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అదే సమయంలో లోయర్ ఆర్డర్ లో మ్యాక్స్ వెల్, జోష్ ఇంగ్లిస్, కెప్టెన్ కమిన్స్ కూడా 41, 38, 37 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇన్నింగ్స్‌ల కారణంగా కంగారూ జట్టు న్యూజిలాండ్‌కు 389 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

రచిన్ రవీంద్ర ట్రబుల్ షూటర్

భారీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని న్యూజిలాండ్ కూడా ఆచితూచి ఆడింది. అయితే న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర తన తుఫాను సెంచరీతో ఆస్ట్రేలియాకు చుక్కులు చూపించాడు. రవీంద్ర కేవలం 89 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు. ఇది కాకుండా డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్ తమ హాఫ్ సెంచరీలతో కంగారూ జట్టుకు ఖంగారు పుట్టించారు.

అయితే ఈ మ్యాచులో ఉత్కంఠంగా ఆఖరి బంతికి మ్యాచ్ ఫలితం వచ్చింది. చివరి ఓవర్‌లో న్యూజిలాండ్‌ విజయానికి 19 పరుగులు చేయాల్సి ఉంది. అదే సమయంలో జట్టు విజయానికి చివరి 3 బంతుల్లో 9 పరుగులు కావాలి. అయితే జేమ్స్ నీషమ్ ఇన్నింగ్స్ ఇక్కడ ముగిసింది. దీంతో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.