KKR vs CSK Highlights: ధనాధన్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌దే పైచేయి, పోరాడి ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్, ఏకపక్షంగా సాగిన మ్యాచ్ నుండి అనూహ్యంగా ఉత్కంఠభరితమైన తీరు అద్భుతం

ఘోర ఓటమి వైపు వెళ్తున్న జట్టును, అండ్రూ రస్సెల్, దినేష్ కార్తీక్ మరియు ప్యాట్ కమిన్స్ తమ అద్భుత పోరాట పటిమతో విజయం అంచుల దాకా తీసుకెళ్లగలిగారు....

KKR vs CSK Match IPL 2021 | Photo; Vivo IPL 2021

Mumbai, April 22: చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు అసలు సిసలైన టీ20 మజాను అందించింది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ చెన్నై సూపర్ కింగ్స్‌పై మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు వచ్చిన చైన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ మరియు డు ప్లెసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ కోల్‌కతా బౌలర్లను పిండి పిప్పి చేశారు. వీరిద్దరి జోడి 12 ఓవర్లకే చెన్నై జట్టుకు తొలి వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే మరో ఒపెనర్ డు ప్లెసిస్ మాత్రం తన జోరును అలాగే కొనసాగించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచి చివరి 20వ ఓవర్ వరకు ఆడిన డుప్లెసిస్ కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు 60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 95 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మిగతా బ్యాట్స్ మెన్ కూడా తమ ధాటిగా షాట్లు ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లకు చెన్నై 3 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇక 221 పరుగుల విజయలక్ష్యంతో రన్ చేజ్ ప్రారంభించిన కోల్‌కతా తొలుత బ్యాటింగ్ లో తడబడింది. లక్ష్యం పెద్దగా కనిపించడంతో కోల్‌కతా టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. కేవలం 5.1 ఓవర్లలో 31 పరుగులు చేసి కోల్‌కతా ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది. దీంతో కోల్‌కతా ఖేల్ ఖతం, మ్యాచ్ ఏకపక్షం అనుకున్నారంతా. కానీ, ఇలాంటి స్థితిలో బ్యాటింగ్ కు వచ్చిన దినేష్ కార్తీక్ మరియు ఆండ్రూ రస్సెల్ జోడి ధైర్యంగా చైన్నై బౌలర్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అండ్రూ రస్సెల్ తనదైన శైలిలో రెచ్చిపోతూ చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 22 బంతుల్లోనే 6 సికర్లు, 3 ఫోర్లతో 54 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దినేశ్ కార్తీక్ కూడా 24 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టును గౌరప్రదమైన స్కోరులో నిలిపాడు. తర్వాత వచ్చిన ప్యాట్ కమ్మిన్స్ కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 34 బంతుల్లోనే 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 66 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అయితే కోల్‌కతాకు ఈ ముగ్గురు మినహా మిగతా బ్యాట్స్ మెన్ చేసిందేమి లేదు. ఆ జట్టులో 4 బ్యాట్స్ మెన్ డకౌట్ కాగా, మరో 4 బ్యాట్ మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఫలితంగా 19.1 ఓవర్లకే ఆలౌట్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ 202 పరుగులు చేసి లక్ష్యానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఏదైమైనా ఘోర ఓటమి వైపు వెళ్తున్న జట్టును, అండ్రూ రస్సెల్, దినేష్ కార్తీక్ మరియు ప్యాట్ కమిన్స్ తమ అద్భుత పోరాట పటిమతో విజయం అంచుల దాకా తీసుకెళ్లగలిగారు.

స్కోర్లు చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 220/ 3; టాప్ స్కోరర్ డు ప్లెసిస్ 95 నాటౌట్

కోల్‌కతా నైట్ రైడర్స్ 19.1 ఓవర్లలో 202/10.

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ డు ప్లెసిస్.

ఇక ఈ హ్యాట్రిక్ విజయంతో చైన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి ఎగబాకగా, వరుసగా మూడు పరాజయాలతో  కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరో స్థానానికి దిగజారింది.