IND vs ENG 5th Test 2021 CANCELLED: భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ రద్దు, జట్టులోని సహాయక సిబ్బందికి కోవిడ్ సోకడంతో నిర్ణయం; త్వరలో ఐపీఎల్21 సెకండ్ ఫేజ్
ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు జరిగి కోవిడ్ కారణంగా గత మే నెలలో వాయిదా పడిన ఐపీఎల్, మరో తొమ్మిది రోజుల్లో రెండో ఫేజ్ రూపంలో కొనసాగించేందుకు బిసిసిఐ ప్రణాళిక రూపొందించుకుంది....
Manchester, September 10: భారత్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న ఐదవ మరియు చివరి టెస్ట్ ఆకస్మికంగా రద్దైంది. చివరి టెస్ట్ నిరవధికంగా వాయిదా పడినట్లు ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు శుక్రవారం అధికారికంగా ధృవీకరించింది.
టీమిండియా అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ యోగేష్ పర్మార్ గురువారం కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారింపబడ్డారు. వెంటనే టీమిండియా సభ్యులందరికీ RT-PCR పరీక్షలు నిర్వహించారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ పాజిటివ్ నిర్ధారణ కాలేదు, దీంతో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరుగుతుందని భావించారు. అయినప్పటికీ చివరి టెస్ట్ జరిగితే ఇరు దేశాల ఆటగాళ్లు కోవిడ్ బారినపడే అవకాశం ఉందన్న భయాందోళనలు వ్యక్తం అయ్యాయి.
ఈ క్రమంలో టెస్ట్ నిర్వహణపై భారత క్రికెట్ బోర్డ్ BCCI మరియు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ECB మధ్య విస్తృత చర్చ జరిగింది. చివరకు రెండు బోర్డులు సంయుక్తంగా టెస్టు మ్యాచ్ రద్దుకే మొగ్గు చూపాయి.
Here's the update:
COVID భయాల కారణంగా, భారత్ తన తుది జట్టును ఖరారు చేయలేకపోయిందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ పేర్కొంది. చివరి టెస్టు రద్దు కావడం చాలా మందికి తీవ్ర నిరాశ కలిగిస్తుందని తన ప్రకటనలో తెలిపింది.
సెప్టెంబర్ 19 నుంచి యూఎఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు జరిగి కోవిడ్ కారణంగా గత మే నెలలో వాయిదా పడిన ఐపీఎల్, మరో తొమ్మిది రోజుల్లో రెండో ఫేజ్ రూపంలో కొనసాగించేందుకు బిసిసిఐ ప్రణాళిక రూపొందించుకుంది. ఇలాంటి సమయంలో టీమిండియా ఆటగాళ్లు కోవిడ్ బారిన పడితే రిస్క్ అని భావించిన బిసిసిఐ, 5వ టెస్టు మ్యాచ్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది.