IPL Auction 2025 Live

India vs England- Highlights: ఉత్కంఠభరితమైన చివరి వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా, 2-1 తేడాతో వన్డే సిరీస్ కూడా కైవసం, భారత పర్యటనలో ఒక్క సిరీస్ కూడా నెగ్గకుండా ఇంగ్లండ్ వైట్ వాష్; ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ ఎడిషన్ ప్రారంభం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) యొక్క 14వ ఎడిషన్, ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. గతేడాది చివర్లో కరోనా కారణంగా దుబాయిలో నిర్వహించిన ఐపీఎల్ ఈసారి అనుకున్న షెడ్యూలుకే ఇండియాలోనే తటస్థ వేదికల్లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ ముంబై - బెంగళూరు మధ్య జరగనుంది.....

India vs England (Photo Credits: Twitter)

Pune, March 29: భారత్ మరియు ఇంగ్లండ్ మధ్య పుణె వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ చివరి బంతి వరకు కొనసాగి విజయం ఎవరివైపో అన్నంత ఉత్కంఠతకు దారితీసింది. ఇంగ్లడ్ బ్యాట్స్ మెన్ అందరూ వెనువెంటనే పెవిలియన్ చేరారు, ఇంగ్లండ్ స్కోర్ 200/7 ఉన్న స్థితిలో ఇక మ్యాచ్ ఏకపక్షమే, సునాయసంగా భారత్ గెలుస్తుందనుకున్నారంతా. అయితే ఇప్పుడే వచ్చిన ఇంగ్లండ్ టెయిల్ ఎండర్ బ్యాట్స్ మెన్ శ్యామ్ కుర్రన్ పట్టుదలతో పోరాడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నామరో ఎండ్ నుంచి జట్టు బాధ్యత తీసుకొని స్కోర్ బోర్డ్ వేగం పెంచాడు. అలా ఇంగ్లండ్ స్కోర్ లక్ష్యానికి దగ్గరగా వచ్చింది. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు కావాలి. ఈ దశలో నటరాజన్ చివరి ఓవర్ వేస్తున్నాడు. అలా చివరి రెండు బంతులకు కూడా 12 పరుగులు చేయాల్సి వచ్చింది, ఊపు మీద ఉన్న కుర్రన్ స్ట్రైక్ లో ఉన్నాడు, అతడు రెండు సిక్సర్లు బాదితే ఇండియా ఖేల్ ఖతమే. కానీ చివరి రెండు బంతుల్లో మొదటి బంతి ఫోర్ మాత్రమే పోయింది. దీంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. చివరి బంతికి కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలర్ కు సూచనలు ఇచ్చాడు. ఎలాంటి వైడ్ బాల్, నోబాల్ వేయకుండా నేరుగా వికెట్ టూ వికెట్ బాల్ వేయమని, అలా లీగల్ డెలివరీ వేస్తే  నెక్స్ బాల్ సిక్స్ వెళ్లినా కూడా ఎలాంటి నష్టం ఉండదుకాబట్టి. ఇక చివరి బంతి కుర్రన్ హార్డ్ హిట్టింగ్ చేసినప్పటికీ కూడా సింగిల్ మాత్రమే వచ్చింది. దీంతో ఇండియా 7 పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 329 పరుగులు చేసి 48.2 ఓవర్లకే ఆల్ ఔట్ అయింది. ఒపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రాణించినప్పటికీ కీలక సమయాల్లో భారత్ బ్యాట్స్ మెన్ ఔట్ అవ్వడం మరియు టెయిల్ ఎండర్స్ ఏమాత్రం స్టాండ్ ఇవ్వక పోవడంతో 350-395 మధ్య స్కోర్ చేస్తందనుకున్న భారత్ అంతకంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. రిషభ్ పంత్ 77, శిఖర్ ధవన్ 67, హార్ధిక్ పాండ్య 64 పరుగులతో టాప్ స్కోరర్స్ గా నిలిచారు.

ఇక ఇంగ్లండ్ 50 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 322 పరుగులు చేయగలిగింది. శ్యామ్ కుర్రన్ 95 పరుగులతో నాటౌట్ గా నిలవగా, డేవిడ్ మలన్ 50 తో రాణించాడు.

కాగా, ఈ విజయంతో భారత్ వన్డే సిరీస్ ను, అంతకుముందు టీ20 సిరీస్ ను, దానికంటే ముందు టెస్ట్ సిరీస్ ను ఇలా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో మొత్తం 3 సిరీస్ లను కైవసం చేసుకున్న భారత్, ఇంగ్లడ్ జట్టును ఖాళీ చేతులతో ఇంటికి పంపించింది. ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ మార్చి వరకు సుమారు 2 నెలలు ఆడి ఒక్క సిరీస్ కూడా గెలవకుండా స్వదేశం బయలుదేరింది. అయితే మంచి పోరాటపటిమను ఇంగ్లండ్ టీమ్ కనబరిచింది.

ఇదిలా ఉంటే త్వరలో, మరో గ్రాండ్ క్రికెట్ ఫెస్టివల్ ఇండియాలో ప్రారంభం కాబోతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) యొక్క 14వ ఎడిషన్, ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. గతేడాది చివర్లో కరోనా కారణంగా దుబాయిలో నిర్వహించిన ఐపీఎల్ ఈసారి అనుకున్న షెడ్యూలుకే ఇండియాలోనే తటస్థ వేదికల్లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ ముంబై - బెంగళూరు మధ్య జరగనుంది.