IND vs NZ T20: కివీస్‌తో తొలి T20 పోరుకు భారత్ సిద్ధం, కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రావిడ్ కాంబినేషన్ లో తొలి మ్యాచ్ ఇదే..

న్యూజిలాండ్ తో పేటీఎం కప్ టి20 సమరానికి సిద్ధమైపోయింది. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్‌ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఇది మొదటి సిరీస్‌ కావడం విశేషం.

India vs New Zealand 2rd T20; Rohit Sharma- Super Over. | Photo: BCCI

IND vs NZ T20: టి20 వరల్డ్‌కప్‌ ఘోర వైఫల్యంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన టీమిండియా సొంతగడ్డపై కొత్త సిరీస్ తో సీజన్‌ను ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. న్యూజిలాండ్ తో పేటీఎం కప్ టి20 సమరానికి సిద్ధమైపోయింది. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్‌ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఇది మొదటి సిరీస్‌ కావడం విశేషం. టీ 20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై, ఆ ఓటమి బాధ నుంచి పూర్తిగా కోలుకోక ముందే కివీస్ ఈ ద్వైపాక్షిక సిరీస్‌ బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కివీస్ తమ కెప్టెన్ విలియమ్సన్‌ కు విశ్రాంతినివ్వడం గమనార్హం.

Rohit Sharma and Rahul Dravid: ఇక టీమిండియా జట్టులో కొన్ని తప్పనిసరి మార్పులు జరగనున్నాయి. రోహిత్, రాహుల్, సూర్యకుమార్, అశ్విన్‌లు ఆడుతుండగా, కోహ్లి, జడేజా స్థానాల్లో ఇషాన్‌ కిషన్, అక్షర్‌ పటేల్‌ ఆడనున్నారు. వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కని లెగ్‌స్పిన్నర్‌ చహల్‌ ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇద్దరు పేసర్లు షమీ, బుమ్రాలకు విశ్రాంతినివ్వగా, భువనేశ్వర్‌కు ఈ సిరీస్ లో అవకాశం దక్కింది. అలాగే హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌కు మరో అవకాశం లభించింది. ఇక మిడిలార్డర్‌లో మరో బ్యాట్స్‌మన్‌ స్థానంలో ఆడేందుకు శ్రేయస్‌ అయ్యర్‌ ముందు వరుసలో ఉండగా, అతనికి రుతురాజ్, వెంకటేశ్‌ అయ్యర్‌లనుంచి పోటీ ఉంటుంది. తాజా ఫామ్‌ చూసుకుంటే రుతురాజ్‌ అద్భుతంగా ఆడుతుండగా... బౌలింగ్‌ కూడా చేయగలగడం వెంకటేశ్‌ బలం.

ఇక రోహిత్‌ శర్మ భారత జట్టు టి20 నాయకత్వం కూడా కొత్త కాదు. 2017–2020 మధ్య అతను 19 మ్యాచ్‌లలో భారత్‌కు సారథిగా వ్యవహరించాడు. ఇందులో 15 విజయాలు దక్కగా, 4 సార్లు జట్టు ఓడింది. అతని కెప్టెన్సీలో జట్టు ఆసియా కప్‌ కూడా గెలిచింది. అయితే కోహ్లి అధికారికంగా తప్పుకోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో అతను టి20 కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు.

ఇండియా vs న్యూజిలాండ్ మొదటి T20I మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది?

భారత్ vs న్యూజిలాండ్ మొదటి T20I మ్యాచ్ భారతదేశంలోని జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరగనుంది.

భారత్ vs న్యూజిలాండ్ మొదటి T20I మ్యాచ్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది?

భారత్ vs న్యూజిలాండ్ మొదటి T20I మ్యాచ్ బుధవారం (నవంబర్ 17) IST రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:30 గంటలకు టాస్ జరుగుతుంది.

ఇండియా vs న్యూజిలాండ్ మొదటి T20I మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?

స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్‌డి, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు మరియు స్టార్ స్పోర్ట్స్ - స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో ఇండియా vs న్యూజిలాండ్ 1వ T20I మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.