KXIP vs RCB Highlights: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఘనవిజయం, 109 పరుగులకే కుప్పకూలిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, సెంచరీతో దుమ్ములేపిన కేఎల్ రాహుల్
మొదట బ్యాట్ తోనూ, ఆ తర్వాత బాల్ తోనూ రాణించి ఆల్ రౌండ్ ప్రదర్శనతో బెంగళూరు జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది.....
Dubai, September 25: దుబాయ్ వేదికగా బెంగళూరు మరియు పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దుమ్ములేపింది. మొదట బ్యాట్ తోనూ, ఆ తర్వాత బాల్ తోనూ రాణించి ఆల్ రౌండ్ ప్రదర్శనతో బెంగళూరు జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు కేవలం 3 వికెట్లు కోల్పోయి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఒపెనర్‌గా వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి వరకూ ఉండి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 69 బంతుల్లోనే 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 132 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా రాహుల్ రికార్డ్ నెలకొల్పాడు. అయితే తన ఇన్నింగ్స్ లో రాహుల్‌కు రెండు లైఫ్స్ లభించాయి. రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జారవిడవడం గమనార్హం. పంజాబ్ జట్టులో మిగతా బ్యాట్స్‌మెన్ తమ వంతు స్కోర్ చేయడంతో బెంగళూరుకు 207 పరుగుల భారీస్కోర్ నిర్ధేషించగలిగారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు కనీస పోటీకూడా ఇవ్వలేకపోయింది. వచ్చిన బ్యాట్స్‌మెన్ అందరూ వచ్చినట్లే వెనుదిరగడం చేశారు. ఛేజింగ్‌లో కింగ్‌గా చెప్పబడే కెప్టెన్ కోహ్లీ కూడా కేవలం ఒక్క పరుగుకే ఔట్ అవ్వడం అభిమానులను నిరాశపరిచింది. పంజాబ్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూపోయారు. వాషింగ్టన్ సుందర్ 30, డివిలియర్స్ 28, ఆరోన్ ఫించ్ 20 పరుగులు మినహా బెంగళూరు జట్టులో మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ సింగిల్ డిజిట్ స్కోర్ దాటలేదు. ఫలితంగా ఆర్సీబీ 17 ఓవర్లకే కుప్పకూలింది, 109 పరుగులకు బెంగళూరు జట్టు ఆలౌట్ అయింది. దీంతో 97 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు ఘనవిజయం సాధించి, ఈ సీజన్ ఐపీఎల్ టోర్నమెంట్లో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు, అంతేకాకుండా ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు. పంజాబ్ జట్టు నుంచే బౌలర్ మహ్మద్ షమీ ఎక్కువ వికెట్లు తీసినందుకు అందించే పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.