SRH Vs CSK: హోం గ్రౌండ్ లో గ్రాండ్ విక్టరీ కొట్డిన హైదరాబాద్, ఈ సీజన్ లో రెండో విజయం సాధించిన ఆరెంజ్ ఆర్మీ
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను వణికించింది. తొలుత సీఎస్కేను 165 పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్ స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది.
Hyderabad, April 05: ఉప్పల్ స్టేడియంలో తమకు తిరుగులేదని ఆరెంజ్ ఆర్మీ(Orange Army) మరోసారి నిరూపించింది. మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై రికార్డు స్కోర్‌తో చరిత్ర సృష్టించిన కమిన్స్ సేన.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను వణికించింది. తొలుత సీఎస్కేను 165 పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్ స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. 6 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసి మెగా టోర్నీలో రెండో విజయం సాధించింది. ఈ విక్టరీతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. స్వల్ప ఛేదనలో ఎస్ఆర్‌హెచ్ విజయంలో మాజీ సారథి ఎడెన్ మర్క్‌రమ్(50), ఓపెనర్ అభిషేక్ శర్మ(37), ట్రావిస్ హెడ్(31)లు తలా ఓ చేయి వేశారు. చిచ్చరపిడుగు హెన్రిచ్ క్లాసెన్(10 నాటౌట్) ఉతికేయగా.. లోకల్ బాయ్ నితిశ్ రెడ్డి(14 నాటౌట్) సిక్సర్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్(277)తో చరిత్రను తిరగరాసిన హైదరాబాద్ బ్యాటర్లు శుక్రవారం రెచ్చిపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను చీల్చిచెండారు. ముంబైపై అర్ధశతకంతో రికార్డు నెలకొల్పిన అభిషేక్ శర్మ.. చెన్నై బౌలర్లకు తన ప్రతాపం చూపించాడు. కేవలం 12 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 రన్స్ కొట్టాడు. ముకేశ్ ఛౌదరీ వేసిన తొలి ఓవరలో అభిషేక్ 4, 6, 6, 4తో 24 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వత దీపక్ చాహర్‌ను ఉతికేస్తూ సిక్స్, ఫోర్ బాదాడు. దాంతో హైదరాబాద్ స్కోర్ రాకెట్ వేగంతో పరుగులు పెట్టింది. 46 పరుగుల వద్ద అభిషేక్ ఔటయ్యాడు.