BCCI Annual Contract: ధోనీపై దాదాగిరి? క్రికెటర్ల వార్షిక ఒప్పందాలలో దిగ్గజ క్రికెటర్ ఎంఎస్. ధోనీ పేరును తప్పించిన బీసీసీఐ, చోటు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది
38 ఏళ్ల ధోనీకి అదే చివరి మ్యాచ్ ....
మహేంద్ర సింగ్ ధోని, ఆ పేరులోనే ఏదో రాజసం ఉన్నట్లు అనిపిస్తుంది. భారత క్రికెట్ చరిత్రను మలుపుతిప్పిన ఆ క్రీడా యోధుడు కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. 2019 ప్రపంచ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఛేజింగ్ చేస్తున్నప్పుడు హృదయ విదారకమైనరీతిలో ధోనీ రనౌట్ అయిన దృశ్యం కోట్ల మంది క్రికెట్ అభిమానుల హృదయాలను కదిలించింది. 38 ఏళ్ల ధోనీకి అదే చివరి మ్యాచ్ అయింది. ఆ తర్వాత నుంచి ధోని (MS Dhoni) అసలు జట్టులో కనిపించనే లేదు. ధోని తిరిగి జట్టులోకి పునరాగమనం చేస్తాడా? లేదా? టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలనందించి, ఆట పరంగా, వ్యక్తిగతంగా ఎంతో ఉన్నత పేరు సంపాదించిన అలాంటి దిగ్గజ క్రికెకటర్ కు కనీసం సరైన వీడ్కోలు పలికే అవకాశం కూడా ఇవ్వరా? అని కోట్లాది మంది అతడి అభిమానుల ప్రశ్నలు, ధోనీ జట్టులోకి పునరాగమనంపై ఎన్నో ఊహాగానాలు వస్తున్న సందర్భంలో బీసీసీఐ క్రికెటర్ల వార్షిక ఒప్పందాల (BCCI Annaul Contract) ను ప్రకటించింది. అందులో ధోనీ పేరు లేకపోవటంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
విచిత్రమేమిటంటే.. ఒకప్పుడు ఎం.ఎస్ ధోనికి భారత జట్టులో చోటు అప్పుడు టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ (దాదా) చొరవతో జరిగిందని చెప్తారు. ఇప్పుడు అదే గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ధోనీ జట్టులో పేరు కోల్పోయాడు.
జనవరి 16న (గురువారం), భారత అత్యున్నత క్రికెట్ మండలి బీసీసీఐ 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు ఆటగాళ్ల వార్షిక ఒప్పందాలను ప్రకటించింది. గ్రేడ్ ఏ+ ఆటగాళ్లకు రూ. 7 కోట్లు, గ్రేడ్ ఏ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, గ్రేడ్ బి ఆటగాళ్లకు రూ. 3 కోట్లు, గ్రేడ్ సి ఆటగాళ్లకు రూ. 1 కోటి చొప్పున ఆ ఏడాది కాలానికి లభించనుంది. గతేడాదిలో గ్రేడ్ ఏ ఆటగాడికి కొనసాగిన ధోనీ, ఈ సారికి అసలు జాబితాలో చోటు కూడా దక్కించుకోలేదు. ఇక గతేడాది గ్రేడ్ బి ఆటగాడిగా కొనసాగిన కే.ఎల్ రాహుల్, గ్రేడ్ ఏ ఆటగాడిగా ప్రమోషన్ పొందాడు. ముగ్గురికి ఏ+, 11 మంది ఆటగాళ్లకు గ్రేడ్ ఏ, 5 మందికి గ్రేడ్ బి మరియు 8 మంది ఆటగాళ్లు గ్రేడి సి కాంట్రాక్టును దక్కించుకున్నారు.
గ్రేడ్ ఏ + ప్లేయర్స్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు జస్‌ప్రీత్ బుమ్రా
గ్రేడ్ ఏ ప్లేయర్స్ : రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చేతేశ్వర్ పూజారా, అజింక్య రహానె, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మహ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్ మరియు రిషబ్ పంత్
గ్రేడ్ బి ప్లేయర్స్ : వృద్దిమాన్ సాహా, ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్.
గ్రేడ్ సి ప్లేయర్స్ : కేదార్ జాదవ్, నవదీప్ సైని, దీపక్ చాహర్, మనీష్ పాండే, హనుమా విహారీ, శార్దుల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్.
అయితే ధోని ఇక ముందు భారత జట్టులో కనిపించిన, కనిపించకపోయినా, ఈ ఏడాది మార్చి 29 నుంచి జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2020 లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలో దిగనున్నాడు.