GT vs RCB: సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ ను మట్టికరిపించిన ఆర్సీబీ, విల్ జాక్స్ మెరుపులతో బెంగళూరుకు మూడో విక్టరీ
గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను వాళ్ల సొంతగడ్డపైనే 9 వికెట్లతో చిత్తు చేసింది. ఆకాశమే హద్దుగా ఆడిన ఆల్‌రౌండర్ విల్ జాక్స్(100 నాటౌట్) సెంచరీతో బెంగళూరును గెలిపించాడు. దాంతో, ఆర్సీబీ ఖాతాలో మూడో విక్టరీ చేరింది.
Ahmadabad, April 28: పదిహేడో సీజన్‌లో తడబడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను వాళ్ల సొంతగడ్డపైనే 9 వికెట్లతో చిత్తు చేసింది. ఆకాశమే హద్దుగా ఆడిన ఆల్‌రౌండర్ విల్ జాక్స్(100 నాటౌట్) సెంచరీతో బెంగళూరును గెలిపించాడు. దాంతో, ఆర్సీబీ ఖాతాలో మూడో విక్టరీ చేరింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(70 నాటౌట్) సైతం హాఫ్ సెంచరీతో కదం తొక్కగా 200 పరుగుల లక్ష్యాన్ని15.5 ఓవర్లకే ఛేదించింది. భారీ ఛేదనలో ఓపెనింగ్ జోడీ మళ్లీ విఫలమైంది. పవర్ ప్లేలోనే ఆర్సీబీ తొలి వికెట్ పడింది. ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్(24) భారీ షాట్ ఆడి ఔటయ్యాడు. సాయి కిశోర్ ఓవర్లో బౌండరీ వద్ద విజయ్ శంకర్ చేతికి చిక్కాడు.
దాంతో, 40 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. డూప్లెసిన్ వెనుదిరిగాక ఫామ్‌లో ఉన్న విల్ జాక్స్ క్రీజులోకి వచ్చాడు. కోహ్లీ జతగా జాక్స్ ఓ రేంజ్‌లో ఆడాడు. అర్ధ శతకం తర్వాత గేర్ మార్చిన జాక్స్.. కోహ్లీని నాన్ స్ట్రయికింగ్‌కు పరిమితం చేశాడు. రెండో వికెట్‌కు 133 రన్స్ జోడించి గుజరాత్‌కు ఓటమి ఖాయం చేశాడు.రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జాక్స్ మరింత రెచ్చిపోయాడు. వరుసగా 6, 6, 4, 6, 6 బాదేసి శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో, ఆర్సీబీ 9 వికెట్లతో గెలుపొందింది.
తొలుత ఆడిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) భారీ స్కోర్ చేసింది. సొంత గడ్డపై యువకెరటం సాయి సుదర్శన్(84 నాటౌట్), చిచ్చరపిడుగు షారుఖ్ ఖాన్(58)లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. 45 పరుగులకే రెండు వికెట్లు పడినా.. వీళ్లిద్దరూ బౌండరీలతో చెలరేగారు. చివర్లో డేవిడ్ మిల్లర్(26 నాటౌట్) సైతం బ్యాట్ ఝులిపించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 రన్స్ కొట్టింది.