Tokyo Olympics 2020: హోరాహోరీ మ్యాచ్‌లో బ్రిటన్ చేతిలో భారత మహిళల హాకీ జట్టు ఓటమి, చేజారిన కాంస్య పతకం; మరో మ్యాచ్‌లో భారత రెజ్లర్ సీమా బిస్లా ఓటమి, ఈరోజు టోక్యో ఒలంపిక్స్ క్రీడా విశేషాలు ఇలా ఉన్నాయి
బ్రిటన్ విజయోత్సవంతో భారత మహిళలు కన్నీళ్లలో మునిగిపోయారు...
Tokyo, August 6: టోక్యో ఒలంపిక్స్ క్రీడల్లో మహిళల హాకీ జట్టు తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. శుక్రవారం కాంస్య పతకం కోసం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన పోరులో ఇండియా 3-4 తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా సాగింది. ఆట తొలి క్వార్టర్‌లో గ్రేట్ బ్రిటన్ అమ్మాయిలు 2 గోల్స్ చేసి 2-0 తేడాతో ఆదిలోనే ఆదిపత్యం ప్రదర్శించారు. అయితే రెండో క్వార్టర్ ముగిసే సరికి భారత్ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. గుల్జిత్ రెండో గోల్స్ చేయగా, కొద్దిసేపటికే మూడో గోల్‌ను వందనా కటారియా చేయడంతో బ్రిటన్ పై భారత్ 3-2 తో లీడ్ లోకి వచ్చింది. అనంతరం మూడో క్వార్టర్ ఆటలో బ్రిటన్ కూడా మరో గోల్ చేయడంతో ఇరు జట్లు 3-3 తేడాతో సమంగా నిలిచాయి. నాలుగో క్వార్టర్‌లో బ్రిటన్ నాలుగో గోల్ చేసింది. దీంతో భారత్‌పై మళ్లీ 4-3 తో లీడ్ లోకి వచ్చింది, దీని తర్వాత బ్రిటన్ భారత జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు, సమయం మించి పోవడంతో చివరకు బ్రిటన్ విజేతగా నిలిచింది.
బ్రిటన్ విజయోత్సవంతో భారత మహిళలు కన్నీళ్లలో మునిగిపోయారు, చివరి వరకూ పోరాడినా ఫలితం ప్రత్యర్థిని వరించడంతో భారత మహిళలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఓదార్చుకోవడం, చూస్తున్న ప్రేక్షకులకు కూడా కంటతడిని తెప్పించింది. అయితే మీ పోరాటం అద్భుతం, గెలుపోటములు సహజం ఇప్పటికీ మీరు మీ పోరాటంతో భారత జాతిని గర్వపడేలా చేశారు అంటూ ప్రముఖుల నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.
See this tweet:
శుక్రవారం మరో మ్యాచ్‌లో భారత్‌కు మరో పరాభవం ఎదురైంది. మహిళల ఫ్రీస్టయిల్ 50కిలోలు విభాగంలో భారత మహిళా రెజ్లర్ సీమా బిస్లా ఓటమి పాలైంది. ట్యునీషియాకు చెందిన ప్రత్యర్థి సర్ర హమ్ది చేతిలో సీమా బిస్లా 1-3 తేడాతో ఓడిపోయింది.
టోక్యోలో ఒలింపిక్ క్రీడల 14వ రోజు విజయవంతంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం భారత్ తరఫున పురుషుల ఫ్రీ స్టైల్ 65 కిలోల ఈవెంట్లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా అద్భుత విజయం సాధించాడు. 65కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో కజక్‌స్థాన్‌కు చెందిన అక్మత్ అలీని ఓడించాడు.
గోల్ఫ్ క్రీడలో అదితి అశోక్ రౌండ్ 3 ఆట మొదలుపెడతారు. అలాగే అథ్లెటిక్స్‌లో, గుర్‌ప్రీత్ సింగ్ 50 కిమీ రేస్ వాక్‌లో పాల్గొంటుండగా, ప్రియాంక గోస్వామి మరియు భావనా జాట్ 20 కిమీ రేస్ వాక్‌లో ఈవెంట్‌లో పాల్గొంటారు.