DC vs RCB Highlights: ఒక్క పరుగు తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు, పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానంలోకి ఆర్‌సిబి; నేడు చైన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్
ఐదో బంతికి ఫోర్ కొట్టడంతో, ఇక చిట్టచివరి బంతికి 6 రన్స్ అవసరమయ్యాయి. అయితే చివరి బంతికి కూడా క్రీజులో ఉన్న దిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఫోర్ మాత్రమే కొట్టగలిగాడు. దీంతో 1 రన్ తేడాతో...
మంగళవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తానికి 1 పరుగు తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. 20వ ఓవర్లో దిల్లీ క్యాపిటల్స్ విజయానికి 14 పరుగులు అవసరం ఉండగా తొలి 4 బంతుల్లో సింగిల్స్ రూపంలో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. ఐదో బంతికి ఫోర్ కొట్టడంతో, ఇక చిట్టచివరి బంతికి 6 రన్స్ అవసరమయ్యాయి. అయితే చివరి బంతికి కూడా క్రీజులో ఉన్న దిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఫోర్ మాత్రమే కొట్టగలిగాడు. దీంతో 1 రన్ తేడాతో బెంగళూరు థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. ఆఖరి ఓవర్ లో బౌలింగ్ వేసిన సిరాజ్ ఆ జట్టు విజయాన్ని నిలువరించాడు. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలంటే ఇటు ఆర్‌సిబికి ఏబి డివిలియర్స్, అటు డీసీకి హెట్ మయర్ మాత్రమే అన్నీ తామై ఒంటరి పోరాటం చేశారు, మిగతా బ్యాట్స్‌మెన్ అంతా జంక్.
మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే.. టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకొంది. దీంతో బ్యాటింగ్ కు వచ్చిన ఆర్‌సిబికి శుభారంభం దక్కలేదు. ఒపెనర్లు విరాట్ కోహ్లీ 12, పడిక్కల్ 17 పరుగులు చేసి ఔట్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ రాజత్ పటిదార్ 31, మాస్క్ వెల్ 25 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ స్థితిలో ఏబి డివిలియర్స్ మళ్లీ అన్నీ తానై జట్టును ఆదుకున్నాడు. చివరి వరకు ఆడిన డివిలియర్స్ 42 బంతుల్లో 5 సిక్సులు, 3 ఫోర్లతో చెలరేగి 75 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఆర్‌సిబి నిర్ణీత 20 ఓవర్లకు 171/5 స్కోర్ చేసింది.
ఇక 172 పరుగుల విజయ లక్ష్యంతో రన్ ఛేజ్ ఆరంభించిన దిల్లీ క్యాపిటల్స్ జట్టు సైతం పరుగులు చేయటానికి చమటోడ్చింది. పృథ్వీ షా 21, శిఖర్ ధవన్ 6, స్టీవెన్ స్మిత్ 4, మార్కస్ స్టోనిస్ 22 ఇలా స్టార్ ప్లేయర్లు కూడా తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అసలు ఇక దిల్లీ గెలుస్తుందనే నమ్మకంలేని సమయంలో షెమ్రాన్ హెట్ మయర్ తన బ్యాటింగ్ తో ఆటకు ఊపు తెచ్చాడు. దీంతో దిల్లీ ఆశలు చిగురించాయి. హెట్ మయర్ 4 సిక్సులు, 2 ఫోర్లతో 25 బంతుల్లోనే 53 పరుగులు పూర్తి చేశాడు. అయితే మరో ఎండ్ లో ఉన్న రిషభ్ పంత్ మాత్రం తన ఆటలో దూకుడు పెంచలేకపోయాడు. వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ 48 బంతుల్లో 58 పరుగులు చేసినా జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. నిర్ణీత 20 ఓవర్లలో దిల్లీ క్యాపిటల్స్ 170/4 స్కోర్ మాత్రమే చేయగలిగింది.
ఏబి డివిలియర్స్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' గా నిలిచాడు. ఇక ఈ విజయంతో ఈ సీజన్ లో ఆడిన 6 మ్యాచుల్లో 5 విజయాలు నమోదు చేసిన ఆర్‌సిబి పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానంలోకి చేరుకొంది.
నేడు దిల్లీ కోట్లా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు 1 మ్యాచ్ మాత్రమే గెలిచి వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన హైదరాబాద్ జట్టుకు ఇక నుంచి ఆడే అన్ని మ్యాచ్ లు తప్పకుండా గెలవాల్సి ఉంది, అయితేనే టోర్నమెంట్లో నిలిచే అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశాలు ఏవైనా ఉండటానికి ఆస్కారం ఉంటుంది.