AP Assembly Budget Session 2024: రెండో రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు సమయం, పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన మంత్రులు

సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Speaker Ayyannapatrudu) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ జరిగింది.

Andhra pradesh Assembly Session for Three Capitals Confirmed on 20th(photo-PTI)

Vjy, Nov 13: రెండో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Speaker Ayyannapatrudu) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. మహిళా కార్యదర్శులు విధి నిర్వహణలో స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. వారికి జాబ్ చార్ట్‌పై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, మాధవి రెడ్డి కోరారు.

ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్య వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నారు. గ్రామ మహిళా కార్యదర్శులకు పోలీస్ డ్రెస్ ఇవ్వాలని వైసీపీ వాళ్ళు చూశారని తెలిపారు. ఎన్‌బీడబ్ల్యూలను ఇంప్లిమెంట్ చేయాలని మహిళా కార్యదర్శులను పంపారన్నారు. వీళ్ళకు నిబంధనలకు విరుద్ధంగా అన్ని రకాల పోలీస్ డ్యూటీలు ఇచ్చారని.. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు.

చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్ట్‌ పురోగతిపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందన్నారు. చింతలపూడి ఎత్తిపోతల ఆరు సంవత్సరాలకు ముందు పెట్టిన మొటార్లు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. వీటిని వినియోగానికి తేవడానికి రూ.2000 కోట్లు ఖర్చు చేస్తే సాధ్యమవుతోందని వెల్లడించారు.

దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ.. నాలుగు జిల్లాలకు సాగు తాగు నీరు అందించేందుకు చింతలపూడి ఎత్తిపోతలను ప్రారంభించారని తెలిపారు. తెలుగుదేశం హయాంలో రూ.3038 కోట్లు ఖర్చు చేసి 40 శాతం పనులు పూర్తిచేశారన్నారు. అయితే 2019-24లో కేవలం రూ.760 కోట్లు ఖర్చు చేసి కేవలం 5 శాతం పనులను మాత్రమే పూర్తయ్యాయన్నారు. చింతలపూడి ఎత్తిపోతల ఆలస్యానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ (Ponguru Narayana) తెలిపారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల్లో విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై డీపీఆర్‌ను సిద్ధం చేశామని.. ఇప్పటికే దీన్ని కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని వివరించారు.

మెట్రో రైలు ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా పక్కన పెట్టేసిందని మంత్రి ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై స్వయంగా కేంద్ర మంత్రిని కలిసినట్లు వివరించారు. సీఎం చంద్రబాబు(Chandra babu) కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారని చెప్పారు. విశాఖలో మొత్తం 76.90 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపడతామన్నారు. రెండు ఫేజ్‌లలో 4 కారిడార్లలో నిర్మిస్తామని మంత్రి నారాయణ వివరించారు.