AP Grama Ward Sachivalayam: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా జీతాల పెంపు, జీవో విడుదల చేసిన జగన్ సర్కారు..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేస్తూ శనివారం జీవో విడుదల చేసింది.

AP CM YS Jagan (Photo-Twitter)

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్​కు​ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేస్తూ శనివారం జీవో విడుదల చేసింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది. అలాగే.. సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ లకు బేసిక్ పే రూ. 23,120 నుంచి రూ. 74,770 ఖరారు చేయగా.. ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ. 22,460 నుంచి రూ. 72,810 ఖరారు చేసింది. ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జూన్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. జూలై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి చేసుకొని.. డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో పాసైన ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయనున్నారు. ఈ అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. గురువారమే దీనికి సంబంధించిన దస్త్రంపై సీఎం జగన్ సంతకం చేయగా.. అధికారిక ఉత్తర్వులు శుక్రవారం వెలువడతాయని భావిస్తున్నారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నూతన పే స్కేల్ ప్రకారం జీతాలు పెరుగుతాయి.

డిపార్ట్‌మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ప్రొబేషన్ పూర్తయిన వారికి మాత్రమే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు అందుతాయని తెలుస్తోంది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్ర స్థాయిలో సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 15 వేలకుపైగా గ్రామ సచివాలయాల్లో 1.15 లక్షల మందికిపైగా ఉద్యోగులను నియమించింది. 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. వారికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రొబేషన్ గడువు పూర్తయ్యాక డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించి పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే 2021 నవంబర్‌లో ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించారు.