AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. 17 కార్పొరేషన్ల మేయర్ రిజర్వేషన్లు విడుదల.. పూర్తి జాబితా ఇదే..
ఆంధ్రప్రదేశ్లోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. అక్టోబర్ 12న విడుదలైన జీవో నంబర్ 252 ప్రకారం, విశాఖపట్నం మేయర్ పదవి జనరల్ మహిళలకు కేటాయించగా, విజయవాడ మేయర్ పదవిని అన్రిజర్వ్డ్గా ప్రకటించారు.
AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ పదవుల రిజర్వేషన్లను అధికారికంగా ఖరారు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం జీవో నెం. 252ను విడుదల చేసింది. ఈ రిజర్వేషన్ల ప్రకటనతో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రాజకీయం వేడెక్కింది. ఏపీలో బీసీ రిజర్వేషన్లకు బ్రేక్.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు.. 34% బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత..
మొత్తం 17 కార్పొరేషన్లలో వివిధ సామాజిక వర్గాలకు మరియు మహిళలకు మేయర్ స్థానాలను కేటాయించారు. వీటిలో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీకి 1 స్థానం కేటాయించగా, జనరల్ కేటగిరీ మహిళలకు 5 స్థానాలను రిజర్వ్ చేశారు. మిగిలిన 4 స్థానాలను అన్రిజర్వ్డ్గా (రిజర్వేషన్ లేనివి) ప్రకటించారు.
సామాజిక వర్గాల వారీగా కేటాయింపుల వివరాలు:
ఎస్టీ (ఒకటి): మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఎస్టీ కేటగిరీకి దక్కింది.
ఎస్సీ (రెండు): రాజమహేంద్రవరం, కర్నూలు కార్పొరేషన్లను ఎస్సీలకు రిజర్వ్ చేశారు.
బీసీ - మహిళ (రెండు): మచిలీపట్నం, కాకినాడ కార్పొరేషన్ల మేయర్ పీఠాలు బీసీ మహిళలకు కేటాయించబడ్డాయి.
బీసీ - జనరల్ (మూడు): అనంతపురం, చిత్తూరు, ఏలూరు కార్పొరేషన్లు బీసీ జనరల్కు కేటాయించారు.
జనరల్ - మహిళ (ఐదు): విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖపట్నం కార్పొరేషన్ల మేయర్ స్థానాలు జనరల్ మహిళలకు రిజర్వ్ అయ్యాయి.
అన్రిజర్వ్డ్ (నాలుగు): తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు కార్పొరేషన్లను అన్రిజర్వ్డ్గా ప్రకటించారు.
ఈ తాజా రిజర్వేషన్ల ఖరారుతో విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రతిష్టాత్మక నగరాల మేయర్ పీఠాలు మహిళల వశంకాగా, విజయవాడ, తిరుపతి వంటి కీలక ప్రాంతాలు అన్రిజర్వ్డ్ జాబితాలో నిలిచాయి. మేయర్ పదవుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో, త్వరలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్పై స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాలు తీవ్రంగా అంచనా వేస్తున్నాయి.