YS Jagan Davos Tour: మే 22 నుంచి సీఎం జగన్ దావోస్ పర్యటన, వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న సీఎం జగన్ టీం, ఏపీ ప్రత్యేకతను ప్రపంచ స్థాయిలో చాటేలా ప్రయత్నం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌లో(స్విట్జర్లాండ్) పర్యటించనున్నారు. వచ్చే నెల మే 22 తేదీన దావోస్‌కు వెళ్లనున్న సీఎం జగన్.. అంతేకాదు అక్కడ జరగబోయే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌లో(స్విట్జర్లాండ్) పర్యటించనున్నారు. వచ్చే నెల మే 22 తేదీన దావోస్‌కు వెళ్లనున్న సీఎం జగన్.. అంతేకాదు అక్కడ జరగబోయే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు.
దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సుమారు 35 గ్లోబల్ కంపెనీలు/ఎంఎన్ సీలు, ప్రపంచ స్థాయి నాయకులు , మేధావులతో శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించి చర్చలు జరపనున్నట్లు మంత్రి అమర్ నాథ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యాన్నిపెంపొందించడానికి సంబంధిత రంగాలలో అపార పెట్టుబడి అవకాశాలు, రెన్యువబుల్ ఎనర్జీ, సాంకేతిక సేవలు, కన్జూమర్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, లాజిస్టిక్స్, క్యాపిటల్ మార్కెట్స్, ఆర్థిక పరస్పర సహకార మార్గాలపై చర్చించేందుకు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ప్రధానంగా దృష్టి సారించిందన్నారు.
జన సంక్షేమానికి పెద్దపీట వేస్తూ , ఏ పౌరుడు వెనకబడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను కల్పిస్తూ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్న ఏపీ సుస్థిరాభివృద్ధి లక్షాన్ని సాధించిన రాష్ట్రాలలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మూడవ రాష్ట్రంగా నిలిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దావోస్ పర్యటనలో ప్రధానంగా 3 కీలక సమావేశాలలో భాగస్వామ్యం కానున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
1. 23వ తేదీన వైద్యరంగంపై కీలక సమావేశం
2. 24వ తేదీన విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశం
3. 24వ తేదీన డీకార్బనైజ్డ్ ఎకానమీ దిశగా మార్పుపై సమావేశం
దావోస్ పర్యటన కోసం పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, చేనేత, జౌళి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పార్లమెంటు సభ్యులు పివి మిథున్ రెడ్డి, ఏపిఐఐసి ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీ ఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, ఇతర సీనియర్ ఐఎఎస్ అధికారుల ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి వెంట వెళుతున్నారు.
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో నిర్వహిస్తోన్న 52వ ప్రపంచ వాణిజ్య సదస్సు ( వరల్డ్ ఎకనమిక్ ఫోరం – డబ్ల్యూఈఎఫ్)కు ప్రెసిడెంట్ జార్జ్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు హాజరవుతున్నట్లు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు.