BRS MLC Kavitha Arrest: కవిత ఛాలెంజ్ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం
కవిత రిమాండ్, కస్టడీ అంశంపై సాయంత్రం 4.30కి ఆర్డర్ రానుంది...అయితే అప్పటి వరకు తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.
ఢిల్లీ: కవిత అరెస్ట్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి.. కవిత రిమాండ్, కస్టడీ అంశంపై సాయంత్రం 4.30కి ఆర్డర్ రానుంది...అయితే అప్పటి వరకు తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఇక వివరాల్లోకి వెళితే..సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ ఈడీ ఉల్లంఘించిందని ఎమ్మెల్సీ కవిత లాయర్ విక్రమ్ చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హామీని ఉల్లంఘించి అరెస్టు చేశారని తెలిపారు. ఇదిలా ఉంటే శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవితను రిమాండ్‌కు పంపాలా లేక సాయంత్రం 4.30లోగా బెయిల్ మంజూరు చేయాలా అన్న అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది.
శనివారం ఉదయం కవితను కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ ఇరుపక్షాల వాదనలు విని తీర్పును సాయంత్రం వరకు రిజర్వ్ చేశారు. కవితను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. కవితను అరెస్టు చేయడం ఈడీ బలవంతపు చర్య అని కవిత తరఫు న్యాయవాది అన్నారు. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఈడీ సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని ఇది ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు.
ED తన వాదనను వివరించింది. న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఈడీ అధికారులతో పాటు కవిత ఇంకా కోర్టులో వేచి ఉన్నారు. ఆమెను కలవడానికి ఎవరికీ అనుమతి లేదు. ఆమెను కలిసేందుకు న్యాయమూర్తి అనుమతి కోసం ఆమె న్యాయవాదుల బృందం ప్రయత్నిస్తోంది.