Plastic Ban: తెలంగాణలో 30 రోజుల 'పల్లె ప్రగతి' కార్యక్రమంపై సీఎం కెసీఆర్ రివ్యూ, రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం, సీఎం సమీక్ష సమావేశంలోని ముఖ్యాంశాలు
మాల్లో పచ్చదనం-పరిశుభ్రత పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా అమలు అయిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపిన సీఎం, ఇకముందు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు....
Hyderabad, October 10: తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 06 నుంచి అక్టోబర్ 05 వరకు జరిగిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం (Palle Pragathi)పై సీఎం కేసీఆర్ (K. Chandrashekhar Rao) ఈరోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రత పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా అమలు అయిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అన్ని శాఖల్లో కెల్లా విద్యుత్ శాఖ అద్భుతంగా పనిచేసి నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా నెలరోజుల పాటు ఈ కార్యక్రమం విజయవంతంగా జరగటానికి పాటుపడిన మంత్రులు, కలెక్టర్లు, డిపిఓలు, డిఎల్పిఓలు, ఎంపిఓలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులకు సీఎం అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపిన సీఎం, ఇకముందు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
గ్రామ పంచాయతీలకు ఎట్టి పరిస్ధితుల్లోనూ నిధుల కొరత రానివ్వబోమని చెప్పారు. ప్రతీ నెలా గ్రామ పంచాయతీలకు 339 కోట్ల రూపాయల ఆర్థిక సంఘ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నదని, ఇది క్రమం తప్పకుండా కొనసాగుతుందని సిఎం స్పష్టం చేశారు.
జిల్లా పంచాయతీ అధికారులు ప్రధాన బాధ్యత తీసుకుని, నిధులను సక్రమంగా వినియోగించుని, గ్రామాల్లో మార్పు తీసుకురావాలని కోరారు. గ్రామ స్థాయిలో రూపొందించిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా పనులు జరగాలని చెప్పారు.
సీఎం రివ్యూ మీటింగ్ హైలైట్స్
• 30 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్ధేశించిన పనులు చాలా వరకు జరిగాయి. స్మశాన వాటికలు, డంపు యార్డులు, నర్సరీల ఏర్పాటుకు చాలా గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. మిగిలిన గ్రామాల్లో కూడా వీలైనంత తొందరలో స్థలాలను గుర్తించాలి. ఏ శాఖ పరిధిలో ఉన్నా సరే, ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని సామాజిక అవసరాల కోసం వాడుకోవాలి
• వార్షిక, పంచవర్ష ప్రణాళికలు కూడా తయారయ్యాయి. గ్రీన్ ప్లాన్ కూడా సిద్ధమయింది. దానికి అనుగుణంగా పనులు జరగాలి
• గ్రామ పంచాయతీలు చెట్లకు నీళ్లు పోయడానికి, చెత్త సేకరణకు ట్రాక్టర్లు కొనుక్కోవాలి. ప్రతీ ట్రాక్టర్ కు ట్యాంకర్, ట్రాలీ, ఫ్రంట్ బ్లేడ్ ఉండాలి
• గ్రామాభివృద్ధి పనులను పర్యవేక్షించే డిపిఓ, డిఎల్పీవో, ఎంపిఓలకు క్రమం తప్పకుండా అలవెన్సులు అందించాలి
• ప్రతీ గ్రామంలో విధిగా నర్సరీ నిర్వహించాలి. మేకలు, ఇతర పశువులు మొక్కలను తినకుండా కంచె ఏర్పాటు చేయాలి
• 30 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా విద్యుత్ శాఖ గ్రామాల వారీగా పవర్ వీక్ నిర్వహించింది
• గ్రామాల్లో వీధిలైట్ల నిర్వహణ కోసం 6,834 కిలోమీటర్ల మేర కొత్త వైరు వేస్తున్నారు
• వీధిలైట్ల నిర్వహణ కోసం కొత్తగా 2,54,424 కరెంటు మీటర్లు బిగిస్తున్నారు
రాష్ట్రంలో ప్లాస్టిక్ పై నిషేధం
పర్యావరణాన్ని విపరీతంగా దెబ్బతీస్తూ, జీవకోటి మనుగడకే ముప్పుగా మారిన ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను రాష్ట్రంలో నిషేధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. త్వరలోనే మంత్రివర్గం సమావేశంలో చర్చించి, ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన విధానాలు తయారు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ పరిధిలో రెండు కోట్ల నిధులు
గ్రామాభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం తదితర పనుల నిర్వహణలో అత్యవసమైన చోట ఖర్చు పెట్టడానికి వీలుగా ప్రతీ జిల్లా కలెక్టర్ కు రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు సిఎం చెప్పారు. ఈ నిధులు కలెక్టర్లు తమ విచక్షణతో వినియోగించాలని చెప్పారు.
అడవులు తక్కువున్న చోట ప్రత్యేక శ్రద్ధ
తెలంగాణలో పచ్చదనం పెంచే లక్ష్యంతో చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మరింత వ్యూహాత్మకంగా ముందుకు తీసుకుపోవాలని సిఎం సూచించారు. అడువులు తక్కువున్న కరీంనగర్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, వరంగల్ అర్బన్, గద్వాల్, నారాయణపేట తదితర జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పారు.
30 రోజుల్లో ముఖ్యమైన పనులు కొన్ని
• వివిధ గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న 22,167 బావులను గుర్తించి, వీటిలో 16,380 (73.89 శాతం) బావుల్ని పూడ్చివేశారు. వీటితోపాటు 11,065 పనికిరాని బోరుబావులను గుర్తించి, వీటిలో 9,888 (89.36శాతం) బోరు బావుల్ని పూడ్చి వేశారు
• 82,804 ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్ వాడీ కేంద్రాలు మొదలైనవి అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి, వీటిలో 80,420 సంస్థలను (97.12శాతం) శుభ్రం చేశారు. మొత్తం 29,25,390 మంది ప్రజలు శ్రమదానంలో పాల్గొన్నారు
• ఇప్పటివరకు 10,870 గ్రామ పంచాయతీల్లో వైకుంఠ ధామాలు, స్మశాన వాటికల ఏర్పాటు కోసం స్థలాలు అవసరమని గుర్తించి, మరో 1881 గ్రామ పంచాయతీల్లో గుర్తించాల్సి ఉంది
• 30 రోజుల ప్రణాళికలో భాగంగా మొత్తం 732.14 లక్షలు(7.32 కోట్ల) మొక్కలను వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో నాటారు
• గ్రామాల్లోకి వచ్చిన కోతులను అడవులబాట పట్టించేందుకు ఉద్దేశించిన మంకీ ఫుడ్ కోర్టులను 1063 ఎకరాల్లో ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది పంద్రాగస్టున తెలంగాణ సీఎం కేసీఆర్ 60 రోజుల ప్రణాళిక ప్రకటించారు. ఇందులో భాగంగా తొలిదశ 30 రోజుల ప్రణాళిక ఈ నెల అక్టోబర్ 05తో ముగిసింది, ఇక రెండో దశలో మరో 30 రోజుల కార్యాచరణను ప్రకటించాల్సి ఉంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)