Hyderabad Metro: ఈరోజు నుంచి జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి, దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా హైదరాబాద్ మెట్రో అవతరణ
అప్పుడెప్పుడో ఉమ్మడి ఏపీలో 2008 లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు మొదలైంది. అయితే అనేక సమస్యలుండటంతో ఈ ప్రాజెక్ట్ పేపర్లకే పరిమితమైంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ ప్రత్యేక చొరవ చూపడంతో ఈ ప్రాజెక్ట్ స్పీడ్ అందుకొని నేడు వాస్తవికరూపం దాల్చింది...
Hyderabad, February 08: శనివారం ఉదయం 6:30 గంటల నుంచి జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రో సర్వీస్ (JBS- MGBS Metro Service) ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. దీంతో సికింద్రాబాద్ బస్ స్టేషన్ - హైదరాబాద్ బస్ స్టేషన్ మధ్య ప్రయాణం సులభతరం అయింది. జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రో మార్గం సుమారు 11 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గంలో మొత్తం 9 స్టేషన్లు ఉంటాయి. పరేడ్ గ్రౌండ్స్ నుంచి మొదలుపెడితే ఈ మార్గంలో వచ్చే స్టేషన్లు జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్‌టీసి క్రాస్‌రోడ్స్, చిక్కడ్‌పల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ మరియు ఎంజీబీఎస్.
దూరప్రయాణాలు చేసే వారి కోసం ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మార్గం జంటనగరాల్లోని రెండు ప్రధాన బస్ స్టేషన్ లను కలపడమే కాకుండా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను కూడా కలుపుతూపోవడం విశేషం. ఈ మెట్రో మార్గం అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గతంలో జేబీఎస్- ఎంజీబీఎస్ మధ్య ప్రయాణించాలంటే కనీసం 40 నిమిషాలు పట్టేది, ఇప్పుడు మెట్రో ద్వారా కేవలం 16 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. ఇది ఎంజీబీఎస్ నుంచి ఇంకా ఫలక్ నుమ వరకు విస్తరించాల్సి ఉంది.
JBS-MGBS Metro Service:
శుక్రవారం మేడారం జాతరను సందర్శించి వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్ (CM KCR), ఆ తర్వాత హైదరాబాద్ తిరుగుప్రయాణం అయి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జేబీఎస్ నుంచి మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఇతర ఉన్నతాధికారులు కలిసి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు.
జేబీఎస్- ఎంజీబీఎస్ మార్గం ప్రారంభంతో హైదరాబాదులో 1,2,3 మరియు 4 కారిడార్లు కలిపి ఫస్ట్ ఫేస్ మెట్రో 69 కిలోమీటర్ల నెట్ వర్క్ పూర్తయింది. దేశంలో దిల్లీ తర్వాత రెండో అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ గల నగరంగా హైదరాబాద్ రికార్డ్ నెలకొల్పింది.
కాగా, ఈ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అప్పుడెప్పుడో ఉమ్మడి ఏపీలో 2008 లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు మొదలైంది. అయితే అనేక సమస్యలుండటంతో ఈ ప్రాజెక్ట్ పేపర్లకే పరిమితమైంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ ప్రత్యేక చొరవ చూపడంతో ఈ ప్రాజెక్ట్ స్పీడ్ అందుకొని నేడు వాస్తవికరూపం దాల్చింది. భాగ్యనగర వాసుల కల సాకారమైంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)