Hyderabad Police: తాగి పట్టుబడితే రూ.10 వేల జరిమానా, వాహనం సీజ్, న్యూ ఇయర్ పేరుతో రచ్చ చేస్తే కుదరదు, డిసెంబర్ 31 రాత్రి స్పెషల్ డ్రంకన్ డ్రైవ్‌లు నిర్వహించనున్న హైదరాబాద్ పోలీసులు, డీజేలకు అనుమతి లేదు
హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) న్యూ ఇయర్ వేడుకల మీద పలు ఆంక్షలు విధించారు. న్యూఇయర్ వేడుకల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగనుండటంతో వీటిని తగ్గించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం తెలంగాణా పోలీస్ శాఖ కొత్త విజన్ 2020 లక్ష్యాలను తీసుకువచ్చారు. 2020 వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్ పోలీసులు (Cyberabad Metropolitan Police)పలు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు.
Hyderabad, December 23: న్యూఇయర్ వేడుకలు (New Year Celebrations) జరుపుకోవాలనుకునే వారికి ఇది నిజంగా షాక్ లాంటి వార్తే. హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) న్యూ ఇయర్ వేడుకల మీద పలు ఆంక్షలు విధించారు. న్యూఇయర్ వేడుకల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగనుండటంతో వీటిని తగ్గించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) గట్టి చర్యలు తీసుకుంటోంది.
ఇందుకోసం తెలంగాణా పోలీస్ శాఖ విజన్ 2020 లక్ష్యాలను తీసుకువచ్చారు. 2020 వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్ పోలీసులు (Cyberabad Metropolitan Police)పలు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు.
న్యూ ఇయర్ వేడుకల పేరుతో రచ్చ చేయడం, గొడవలకు దిగడం, అమ్మాయిలను ఏడిపించడం వంటి పిచ్చి పనులు చేస్తే తాట తీస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ అతిక్రమిస్తే... జైల్లో పెడతామన్నారు. ఈసారి బాణసంచా కాల్చినా, బార్లు పబ్బుల్లో అశ్లీల వేషాలు వేసినా చర్యలు తప్పవు.
ఇక మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. డిసెంబర్ 31 రాత్రి తాగి వాహనాలు నడుపుతూ దొరికితే (Drunk and Drive) రూ.10వేలు ఫైన్ వేస్తామన్నారు. అంతేకాదు వాహనాన్ని సీజ్ చేస్తారు. డిసెంబర్ 31న రాత్రి స్పెషల్ డ్రంకన్ డ్రైవ్ లు నిర్వహించనున్నారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుపడితే రూ.10 వేల భారీ జరిమానా విధించడంతో పాటు వాహనాన్ని కూడా సీజ్ చేయనున్నారు.
డిసెంబర్ 31 రాత్రి పాటించాల్సిన నిబంధనలు:
1. ఆ రోజు రాత్రి 8 నుంచి 1 గంట వరకే వేడుకలను నిర్వహించాలి. వేడుకల నిర్వాహకులు తప్సనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. వేడుకలు జరిగే ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
2. డీజేకు అనుమతి లేదు, 45 డెసిబెల్స్ మ్యూజిక్ శబ్దం మించకూడదు. ఎక్కడా డ్రగ్స్, మత్తు పదార్థాలు విక్రయించకూడదు. ట్రాఫిక్ రద్దీ, జామ్‌లు తలెత్తకుండా వేడుక నిర్వాహకులు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి.
3. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనే వాహనాలు ఇవ్వరాదు. వేడుకల్లో అశ్లీలానికి తావివ్వరాదు. మైనర్లకు ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో మద్యం సరఫరా చేయకూడదు. వేడుకల సందర్భంగా గుర్తుతెలియని వ్యక్తులు ఏవైనా పానీయాలు తాగకూడదు.
4. మహిళలు, పిల్లలను నిర్మానుష్య ప్రాంతాల్లో జరిగే వేడుకలకు పంపకూడదు. క్యాబ్, ఆటో డ్రైవర్లు అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే డయల్ 100, లేదా హాక్ ఐ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి. వేడుకలు జరిగే ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ నేరమనే సూచిక బోర్డులు పెట్టాలి.
5. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడితే రూ.10 వేల జరిమానా, వాహనం సీజ్ చేస్తారు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యలు ఎదురైతే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాట్సప్ నం. 850-041-1111 కు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఇక అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉన్నా, వస్తువులు కనపడినా వెంటనే డయల్ 100 లేదా రాచకొండ వాట్సప్ నం. 949-061-7111, సైబరాబాద్ వాట్సప్ నం. 949-061-7444 కు సమాచారం అందించాలి.
డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఓఆర్‌ఆర్‌పై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాలకు అనుమతి లేదని రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేశ్ భగవత్, సజ్జనార్‌లు స్పష్టం చేశారు. దీంతో పాటు రెండు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ఫ్లైఓవర్లపై రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు వాహనాలను అనుమతించరు.