India General Elections 2024 Results: తెలంగాణ సత్తా చాటాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ విశ్వప్రయత్నం...ఓటరు కరుణ ఎవరివైపు..మల్కాజిగిరిలో గెలుపు ఎవరిది..
అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు సాధించాలని సత్తా చాటాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ప్రతిపక్షంలోని బీఆర్ఎస్, బీజేపీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
తెలంగాణలో అందరి చూపు ప్రస్తుతం ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుంది అనే దానిపైనే కేంద్రీకృతం అయి ఉంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు సాధించాలని సత్తా చాటాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ప్రతిపక్షంలోని బీఆర్ఎస్, బీజేపీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు కీలక స్థానాల్లో హోరాహోరి పోటీ నెలకొని ఉంది. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో మాధవి లత బిజెపి తరఫున పోటీ చేస్తూ ఆమె అసదుద్దీన్ ఓవైసీ ని ఓడించాలని చూస్తున్నారు. దీంతో ఈ ఫలితం పై సర్వత్ర ఉత్కంఠత నెలకొని ఉంది. అలాగే మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం దేశంలోనే అతిపెద్దది ఈ స్థానంపై కూడా అందరి అంచనాలు ఉత్కంఠ గా ఉన్నాయి. . మల్కాజ్గిరి బరి నుంచి బిజెపి తరఫున ఈటెల రాజేందర్, కాంగ్రెస్ తరపున సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఇక తెలంగాణలోని ఇతర స్థానాల్లో నిజామాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్ కీలకమైనవిగా భావిస్తున్నారు. ఇందులో మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ఉన్న ఎంపీ సీటు కావడం విశేషం. ఇక్కడి నుంచి బిజెపి తరఫున ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోటీ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ తరపు నుంచి వంశీచంద్ రెడ్డి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
మరోవైపు బిజెపి తమ సిట్టింగ్ స్థానాలైన కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ స్థానాలను నిలబెట్టుకోవడంతోపాటు మరికొన్ని స్థానాలను కూడా సాధించి డబుల్ డిజిట్ సాధించాలని ఉత్సాహంతో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాగైనా సరే తమ సత్తా చాటి పదికి పైగా స్థానాలు సాధించాలని పట్టుదలతో ఉంది. ఇక మరోవైపు అధికారం కోల్పోయిన భారతీయ రాష్ట్ర సమితి ఎలాగైనా పూర్వ వైభవం కోసం వీలైనంత ఎక్కువ స్థానాలు సాధించాలని ప్రయత్నం చేస్తుంది.