Telangana: సిరిసిల్లలో వస్త్ర తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్న 'షాపర్స్ స్టాప్', తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో పెట్టుబడులకు ముందుకొచ్చిన వివిధ పారిశ్రామికవేత్తలు
దీంతో స్థానికంగా వందల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి....
Mumbai, January 3: ముంబైలో ఫార్మా, వస్త్ర తదితర రంగాలకు చెందిన పరిశ్రమల నాయకులతో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి (Minister for IT, Telangana) కేటీఆర్ శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, అవకాశాల గురించి సమావేశంలో మంత్రి (Kalvakuntla Taraka Rama Rao) వివరించారు.
ప్రగతిశీల పారిశ్రామిక విధానాల గురించి, టీఎస్ ఐపాస్ కింద సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థపై మంత్రి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో వస్త్ర రంగంలో వస్తున్న పారిశ్రామిక పార్కుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
ఈ క్రమంలో సిరిసిల్ల (Sircilla) జిల్లాలో గల అపెరల్ పార్కులో దుస్తుల తయారీ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రముఖ కంపెనీ 'షాపర్స్ స్టాప్' (Shoppers Stop) ముందుకొచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం, షాపర్స్ స్టాప్ ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, షాపర్స్ స్టాప్ తెలంగాణలోని సిరిసిల్లలో మ్యాన్యుఫాక్చర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులు పెట్టనుంది. దీంతో స్థానికంగా వందల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ ఒప్పందంపై ఐటి అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, షాపర్స్ స్టాప్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ రాజీవ్ సూరి సంతకం చేశారు.
అనంతరం, ఫార్మా నాయకులు మరియు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో ఔషధ మరియు లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడుల అవకాశాలను మంత్రి ఎత్తిచూపారు. దీనికి సంబంధించిన పురోగతి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సమావేశం తర్వాత ఫార్మారంగంలో రాష్ట్రానికి సుమారు రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అంతకుముందు రోజు మంత్రి కేటీఆర్ 2020ని ఏఐ (Artificial Intelligence) ఇయర్ (కృత్రిమ మేధస్సు ఏడాది) గా మంత్రి ప్రకటించారు. వచ్చే దశాబ్దం నాటికి హైదరాబాద్‌ను టాప్ 25 గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్నోవేషన్ హబ్‌లలో ఒకటిగా స్థాపించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఏఐ, బ్లాక్ చైన్, క్లౌడ్, రొబొటిక్స్ వాటిని గుర్తించి తెలంగాణలో అభివృద్ధిపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో 10 సంస్థలతో ఏఐకి సంబంధించిన 8 ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుంది.
ఇంటెల్, ఐఐఐటీ హైదరాబాద్, PHFI, Nvidia, ఆడోబ్, ఐఐఐటీ ఖరగ్ పూర్, వాద్వాని, హెక్సగాన్, నార్వే క్లస్టర్ ఆఫ్ ఏఐ, టెక్ మహీంద్రా సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి.