New Year 2024: పోలీసుల హెచ్చరికలు బేఖాతర్, భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, హైదరాబాద్‌లో 1,500, సైబరాబాద్‌లో 1,241, మద్యం ద్వారా ఒక్క రోజే రూ.125 కోట్ల ఆదాయం
కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు.
Hyd, Jan 1: నూతన సంవత్సర వేడుకలు 2024 వేళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 31 సందర్భంగా మందుబాబులను పోలీసులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. దీంతో, వేల సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. పలుచోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు.
తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలు సహా 1239 మందిపై కేసుల నమోదు చేశారు. 938 ద్విచక్ర వాహనాలు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1241 కేసులు నమోదు అయినట్టు పోలీసులు తెలిపారు. రాచకొండ పరిధిలో 517 మందిపై కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్‌లో బ్రీత్ అనలైజర్ కౌంట్ 200 పాయింట్లు దాటిన వారు 151 మంది ఉన్నట్టు వెల్లడించారు. తనిఖీల్లో పోలీసులతో పలుచోట్ల వాహనదారులు వాగ్వాదానికి దిగారు.
ఇదిలా ఉంటే కొత్త ఏడాది సందర్బంగా మద్యం అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది. డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజునే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్ , లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయి. దీంతో, ఆదివారం ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక, గడిచిన మూడు రోజుల్లో తెలంగాణలో రూ.658 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.