Lok Sabha Elections 2024: తెలంగాణలో ‘నోటా’కు భారీగా ఓట్లు.. టాప్‌లో సీఎం నియోజకవర్గం
అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు ఓట్లు పడడం..
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు లక్షకు పైగా నోటాకు ఓట్లు పోలయ్యాయి. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు ఓట్లు పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ, ప్రతిపక్షాలపై రాష్ట్ర ఓటర్లు ఏ స్థాయిలో అసంతృప్తితో ఉన్నారో అర్థమవుతోంది.
ఇటీవల విడుదలైన లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకారం తెలంగాణలో మొత్తం 1,04,244 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఇందులో నియోజకవర్గాల ప్రకారం చూస్తే సీఎం నియోజకవర్గమైన మల్కాజ్‌గిరిలో అత్యధికంగా 13,366 ఓట్లు నోటాకు పడ్డాయి. ఆ తర్వాతి స్థానంలో 11, 762 ఓట్లతో ఆదిలాబాద్ నిలవగా.. 8,380 ఓట్లతో వరంగల్ మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో కారు బీభత్సం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
ఆ తర్వాత స్థానాల్లో నోటాకు అత్యధికంగా ఓట్లు పడ్డ నియోజకవర్గాల జాబితాను పరిశీలిస్తే.. ఖమ్మం - 6,782 , మహబూబాబాద్- 6,591, చేవెళ్ల - 6,423, నల్గొండ - 6,086, పెద్దపల్లి - 5,711, కరీంనగర్ - 5,438, సికింద్రాబాద్ - 5,166, మెదక్ - 4,617, భోన్‌గిరి - 4,646, నాగర్‌కర్నూల్ - 4,580, నిజామాబాద్ - 4,483, మహబూబ్‌నగర్ - 4,330, జహీరాబాద్ - 2,977, హైదరాబాద్ - 2,906 ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
కాగా.. నోటా అంటే (NOTA - None Of the Above) నన్ ఆఫ్ ది అబవ్ అని అర్థం. అంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోతే.. వారి పట్ల ఓటరు తన వ్యతిరేకతను తెలియజేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నోటా ఆప్షన్‌ను తీసుకొచ్చింది. 2013లో తొలిసారిగా ఈ ఆప్షన్‌ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.