PM Modi Condoles: బీజేపీ సీనియర్ నేత జంగారెడ్డి మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం, ట్వీట్ ద్వారా తెలుగులో సంతాపం తెలిపిన మోదీ..
ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. జంగారెడ్డి కుమారుడు సత్యపాల్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
న్యూఢిల్లీ, జనవరి 5: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. జంగారెడ్డి కుమారుడు సత్యపాల్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జనసంఘ్, బీజేపీ విజయ పథంలోకి తీసుకెళ్లడానికి జంగారెడ్డి విశేష కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. అనేకమంది బీజేపీ కార్యకర్తలకు ఆయన ప్రేరణ ఇచ్చారన్నారు.
'శ్రీ సి .జంగా రెడ్డి గారు ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. జన సంఘ్ నూ, బీజేపీ నూ ఉన్నత శిఖరాలకు తీసికెళ్ళడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఎంతో మంది ప్రజల మనసులలో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంతో మంది కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చారు. భాజపా క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు సమర్థవంతమైన వాణిని అందించారు. ఆయన మరణం పట్ల చింతిస్తున్నాను. ఆయన కుమారుడితో మాట్లాడి సంతాపం తెలపడం జరిగింది. ఓం శాంతి' అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చందుపట్ల జంగారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆయన పార్థివ దేహాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు.