PV Narasimha Rao's Birth Centenary Celebrations: పీవీ జ్ఞానభూమిలో ఘనంగా ముగిసిన శతజయంతి ఉత్సవాలు, పీవీ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్, గవర్నర్ సౌందర రాజన్, పీవీని ఎంత గౌరవించుకున్న తక్కువేనని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు (PV Narasimha Rao's birth centenary celebrations) సోమవారం నగరంలోని నెక్లెస్‌రోడ్‌లోని పీవీ మార్గ్‌లో (PV Marg) ఉన్న పీవీ జ్ఞానభూమిలో ఘనంగా జరిగాయి.
Hyderabad, June 28: దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు (PV Narasimha Rao's birth centenary celebrations) సోమవారం నగరంలోని నెక్లెస్‌రోడ్‌లోని పీవీ మార్గ్‌లో (PV Marg) ఉన్న పీవీ జ్ఞానభూమిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Governor Tamilisai Soundararajan), ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (Telangana Chief Minister K Chandrashekar Rao) నెక్లెస్‌రోడ్‌లోని 26 అడుగుల పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్, సీఎంలు పీవీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ పీవీ మార్గ్‌ను ప్రారంభించారు.
ముందుగా సీఎం కేసీఆర్, గవర్నర తమిళిసై పీవీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం గవర్నర్‌తో కలిసి సీఎం కేసీఆర్ పీవీ కాంస్య విగ్రహాన్ని (CM KCR unveil PV statue) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పీవీ ఒక కీర్తి శిఖరం, దీప స్తంభమని అభివర్ణించారు. పీవీ నరసింహారావు చరిత్ర అందరికీ ఆదర్శం, ఆయన చాలా పటిష్టంగా భూ సంస్కరణలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నెక్లెస్ రోడ్‌కు పీవీ మార్గ్‌గా నామకరణం చేసిన విషయం తెలిసిందే.
సౌత్ ఇండియా నుంచి ఎన్నికైన తొలి ప్రధానమంత్రి పీవీ నరసహింహారావు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును ఎంత స్మరించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తక్కువే. పీవీ ఒక కీర్తి శిఖరం. పరిపూర్ణమైన సంస్కరణ శీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదులు పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నేటితో సుసంపన్నమవుతున్నాయి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నప్పటికీ.. గతేడాది కాలంలో కేకే ఆధ్వర్యంలో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన మహేశ్ బిగాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు .
Here's CMO Telangana Tweet
విద్యా సంస్కరణల్లో భాగంగా గురుకుల, నవోదయ పాఠశాలలను పీవీ నరసింహారావు తీసుకొచ్చారు అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.. పీవీ ప్రారంభించిన గురుకుల పాఠశాలలోనే చదివి డీజీపీని కాగలిగానని మహేందర్ రెడ్డి స్మరిస్తూంటారు. ఇలా ఎంతో మంది పీవీని స్మరించుకుంటారని సీఎం పేర్కొన్నారు. పీవీ తీసుకొచ్చిన అనేక సంస్కరణలు మన కళ్ల ముందు ఉన్నాయి అని కేసీఆర్ తెలిపారు. పీవీ చేపట్టిన భూ సంస్కరణలు భారతదేశంలో ఇతర రాష్ట్రాలు మార్గదర్శకంగా తీసుకున్నాయి. పీవీ 800 ఎకరాల విలువైన సొంత భూమిని ప్రజలకు ధారదాత్తం చేశారు. ఆ విధంగా తన నిబద్ధతను చాటుకుంటూ భూ సంస్కరణలను అమలు చేశారు.
మన కాకతీయ వర్సిటీలో పీవీ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. వర్సిటీ వీసీ తాటికొండ రమేశ్ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తున్నదని పేర్కొన్నారు. పీవీ అనేక పుస్తకాలు రచించారు. అనేక రచనలను ఆయన అధ్యయనం చేశారు. స్వాతంత్య్రం పూర్వం వారు జన్మించినప్పటికీ స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్నారు అని సీఎం గుర్తు చేశారు. దేశం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో.. పీవీ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. నాటి ఆర్థిక సంస్కరణ వల్లే నేడు పెట్టుబడులు వస్తున్నాయి. ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. రాష్ట్రాల బడ్జెట్ లక్షల కోట్లకు చేరిందన్నారు. మన్మోహన్ సింగ్ పీవీని ప్రశంసించేవారు. పీవీని గురువు, తండ్రిలాగా స్మరించుకునేవారు మన్మోహన్ సింగ్. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో తాను ఆర్థిక మంత్రిగా ఉండటం గర్వంగా ఫీలవుతానని మన్మోహన్ సింగ్ అనేవారని సీఎం గుర్తు చేశారు.
నమస్తే తెలంగాణ విశేష కృషి
పీవీ మన తెలంగాణ ఠీవీ అని గతేడాదే తాను చెప్పానని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ విధంగా పీవీ రచనలు, రాజకీయ వ్యాసాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు.. నమస్తే తెలగాణ దినపత్రిక విశేషమైన కృషి చేసింది. పీవీ ప్రజ్ఞను అనేక రకాలుగా ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆ పత్రిక చాలా కృషి చేసింది. ఈ సందర్భంగా ఆ పత్రిక వారికి ప్రత్యేక హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పీవీ రాజకీయ వ్యాసాలను ప్రచురించారు. నమస్తే పీవీ పేరుతో పుస్తకం తేవడం గొప్ప విషయమని సీఎం అన్నారు.