Emergency Vehicles in TS: తెలంగాణలో అత్యవసర సేవలకు 466 ఎమర్జెన్సీ వాహనాలు, నేడు జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
చంద్రశేఖర రావు నేడు 466 ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారు. నేటి నుంచి వైద్యారోగ్యశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలకు కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108, 102 అనే హెల్ప్‌లైన్ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా బ్రాండింగ్ చేశారు
Hyd, August 1: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేడు 466 ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారు. నేటి నుంచి వైద్యారోగ్యశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలకు కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108, 102 అనే హెల్ప్‌లైన్ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా బ్రాండింగ్ చేశారు. ఈ వాహణాలపై సీఎం కేసీఆర్ ఫొటో, తెలంగాణ ప్రభుత్వ లోగో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్థివ వాహనాల సేవలు ఉచితంగా అందిస్తామనే విషయాన్ని తెలిపేవిధంగా ఉచితసేవ అని ముద్రించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 426 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. 175 అంబులెన్సుల స్థానంలో కొత్తవి రిప్లేస్ చేస్తుండగా, మిగిలిన 29 అంబులెన్సులను అవసరమున్నట్టు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వినియోగించనున్నారు. కొత్తగా వచ్చే 204 వాహనాలను కలిపితే రాష్ట్రంలో 108 అంబులెన్సుల సంఖ్య 455కు పెరుగుతుంది.
గర్భిణుల కోసం ప్రవేశపెట్టిన అమ్మఒడి(102) వాహనాలు రాష్ట్రంలో 300 ఉన్నాయి. అయితే ఇందులో 228 వాహనాలకు కాలం చెల్లాయి. వాటి స్థానంలో కొత్తగా 228 వాహనాలను రీప్లేస్ చేస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి రానున్న అమ్మఒడి వాహనాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.వాహనం వెనుకభాగంలో అమ్మకు ఆత్మీయతతో, బిడ్డకు ప్రేమతో అనే ట్యాగ్‌లైన్‌తో పాటు, సీఎం కేసీఆర్ ఓ బాలింతకు కేసీఆర్ కిట్ అందిస్తున్న ఫొటో ముద్రించారు. చూడటానికి ఆహ్లాదంగా ఉండే రంగుల్లో, అమ్మఒడి కార్యక్రమ లోగో, శిశువు ఫొటోలతో 102 వాహనాలు కొత్తలుక్ సంతరించుకున్నాయి.
Here's Video
ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణించినవారి పార్థివదేహాలను స్వస్థలాలకు తరలించడం కుటుంబసభ్యులకు ఖర్చుతో కూడుకున్న పని. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉచితంగా హర్సే వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ హర్సే వాహనాలు 50 ఉన్నాయి. ఇందులో 34 వాహనాలకు కాలం చెల్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా 34 వాహనాలను కొనుగోలు చేసి రిప్లేస్ చేస్తున్నది.
అత్యవసర సమయాల్లో సేవలు అందించే కొన్ని వాహనాలకు కాలం చెల్లిపోవడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత వాహనాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవడంతో పాటు, అవసరమున్నట్టు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వాహనాల సేవలు విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.