Regulatory Farming Policy: ప్రజలు బలవర్ధకమైన ఆహారాన్ని తినాలి, అలాంటి పంటలనే రైతులు సాగుచేయటం అలవాటు చేసుకోవాలి: నియంత్రిత వ్యవసాయంపై సమీక్షలో సీఎం కేసీఆర్
ప్రజలు ఏది పడితే అది తింటున్నారు తప్ప, బలవర్థకమైన ఆహారం తినడం లేదని, అలాంటి ఆహారాన్ని తినేలా ప్రోత్సహించాలని, అలాంటి పంటలు పండించాలని సిఎం చెప్పారు...
Hyderabad, June 3: మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని, దీని కోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ సారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తున్నదని, ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్ లో కొనసాగాలని సిఎం ఆకాంక్షించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని సిఎం చెప్పారు. అంతిమంగా రైతు లాభం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం రైతుల సహకారంతో విజయవంతం చేయాలని కోరారు.
దేశంలో, రాష్ట్రంలో ఆహార భద్రత సాధించగలిగినప్పటికీ, పోషకాహార భద్రత సాధించలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏది పడితే అది తింటున్నారు తప్ప, బలవర్థకమైన ఆహారం తినడం లేదని, అలాంటి ఆహారాన్ని తినేలా ప్రోత్సహించాలని, అలాంటి పంటలు పండించాలని సీఎం అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలతో పాటు, రోగ నిరోధక శక్తి పెరగాలని సీఎం ఆకాంక్షించారు.
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగు పద్ధతిగా జరగడం కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో సీఎం కేసీఆర్ మూడు రోజుల పాటు విస్తతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు.
సీఎం సూచనలు ఇలా ఉన్నాయి
• రాష్ట్రంలో, దేశంలో ప్రజల ఆహార అలవాట్లపై అధికారులు ఖచ్చితమైన అంచనాలు రూపొందించాలి. రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రాంతానికి ఏ ఆహార పదార్థాల అవసరం ఉందో గమనించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పంటల సాగు జరగాలి. ఇది ఏ ఒక్క ఏడాదికో పరిమితం కావద్దు. నిరంతరం సాగుతుంది. దీనికోసం ప్రభుత్వం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కమిటీని నియమిస్తుంది. నిపుణుల, నిష్ణాతులను ఈ కమిటీలో నియమిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్ – మార్కెటింగ్ – ధరలు తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఏ పంటలు వేయడం వల్ల లాభం కలుగుతుందో సూచిస్తుంది. దాని ప్రకారం పంటల సాగు చేపట్టాలి.
• వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెరగడం కూడా చాలా ముఖ్యం. సాగు పద్ధతుల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయి. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులు అవలంభించాలి. ఎరువులు, పురుగు మందుల వాడకంలో కూడా శాస్త్రీయత ఉండాలి. మేలు రకమైన విత్తనాలు వేయాలి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలి. యాంత్రీకరణకు అనుగుంగా సాగు జరగాలి. ఈ విషయాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, తగు సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం అగ్రికల్చర్ రీసెర్చి కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ సూచించిన విధంగా సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలి.
• తెలంగాణలో పత్తి పంట ఎక్కువ పండిస్తున్నారు. పత్తిలో ఉత్పాదకత పెంచడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి? ఏ రకమైన పత్తికి మార్కెట్ ఉంది? అలాంటి పత్తి సాగు చేయాలంటే ఏం చేయాలి? తదితర విషయాలను అధ్యయనం చేసి, తగు సూచనలు ఇవ్వడానికి, పత్తి రైతులకు చేదోడు వాదోడుగా ఉండడానికి ప్రభుత్వం కాటన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది.
• తెలంగాణలో పండే పత్తికి మంచి డిమాండ్ ఉంది. నూలు పొడవు ఎక్కువ ఉండడం వల్ల మంచి ధర వస్తుంది. అయితే పత్తిలో మట్టి, పుల్లలు, ఇతర చెత్త కలవడం వల్ల సరుకులో నాణ్యత (ఫేర్ ఆవరేజ్ క్వాలిటీ - FAQ.) శాతం పడిపోయి, ధర తగ్గుతున్నది. కష్టపడి పంట పండించే రైతులు పత్తి ఏరిన తర్వాత అందులో చెత్తా చెదారం కలవకుండా జాగ్రత్త పడాలి. ఈ విషయంలో రైతులకు అవగాహ కల్పించాలి.
• రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లులు, స్పిన్నింగ్ మిల్లుల సామర్థ్యంపై ఖచ్చితమైన అంచనాలు వేయాలి. సరిపోను ఉన్నాయా? ఇంకా నెలకొల్పాలా? అనే విషయంపై శాస్త్రీయమైన అంచనా ఉండాలి. పత్తి పంట పండే ప్రాంతాల్లోనే ఇవి నెలకొల్పడం వల్ల రవాణా వ్యయ, ప్రయాసలు కూడా తప్పుతాయి.
• తెలంగాణలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలున్నాయి. ఏ నేలలు ఏ పంట సాగుకు అనువైనవో తేల్చాలి. దానికి అనుగుణంగా పంటల సాగు చేపట్టాలి. పంటల కాలనీల ఏర్పాటు కోసం నేలల విభజన చేయాలి. ఈ వివరాలను రైతులకు తెలపాలి.
• ప్రజలు నిత్యం తినే పండ్లు, కూరగాయలను రాష్ట్రంలో దిగుమతి చేసుకుంటున్నాం. ఏఏ రకాల పండ్లు, కూరగాయలు దిగుమతి చేసుకంటున్నామో లెక్కలు తీయాలి. వాటిని మన రాష్ట్రంలోనే పండించాలి. పండ్లు, కూరగాయల విషయంలో స్వయం సమృద్ధి సాధించే ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే పట్టణ ప్రాంతాల పరిసరాల్లోని భూముల్లో పండ్లు, కూరగాయల సాగుకు అనువైన నేలలను గుర్తించి, రైతులను ప్రోత్సహించాలి. దీనివల్ల అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుంది.
• ఆలుగడ్డలు, అల్లం, ఎల్లిపాయలను ప్రజలు ఎక్కువగా వాడతారు. వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. రాష్ట్రంలోనే వాటిని పండించాలి. ఎక్కడ పండించాలి? మేలైన సాగు పద్ధతులేంటి? తదితర విషయాలపై రైతులకు మార్గదర్శనం చేయాలి.
• ఉల్లిగడ్డల లభ్యత, ధరల విషయంలో ప్రతీ ఏడాది అనిశ్చితి, అస్పష్టత ఉంటుంది. ఇలా ఎందుకుండాలి? తెలంగాణ ప్రజల అవసరాలకు తగ్గట్టు ఉల్లి సాగు జరగాలి. ఎప్పుడూ కొరత లేకుండా చూసే వ్యూహం అవలంభించాలి.
• చిక్కుడు, మునగలో మంచి పోషకాలు ఉన్నాయి. వాటిని ఎక్కువగా తినేలా ప్రజలను చైతన్య పరచాలి. వాటి సాగు పెంచాలి.
• రాష్ట్రంలో కొత్తగా అనేక ప్రాజెక్టులు నిర్మాణమవుతున్నాయి. మిషన్ కాకతీయతో చెరువుల నీటి సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. 24 గంటల ఉచిత విద్యుత్ వల్ల బోర్ల ద్వారా సాగు పెరిగింది. దీంతో ప్రతీ ఏటా కొత్తగా ఆయకట్టు పెరుగుతూ వస్తున్నది. పెరిగిన/పెరిగే విస్తీర్ణాన్ని సరిగ్గా అంచనా వేస్తూ, పంటల సాగు ప్రణాళికలు తయారు చేయాలి.
• హర్టికల్చర్ డిపార్టుమెంటును మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి.
• సరైన పంటల లెక్కల నమోదు కోసం ప్రత్యేకంగా స్టాటిస్టికల్ విభాగం ఏర్పాటు చేయాలి.