CM KCR's Health Bulletin: సీఎం కేసీఆర్‌కు కరోనా లక్షణాలు పోయాయి, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, త్వరలోనే కోలుకుంటారు; సీఎం ఆరోగ్యంపై డాక్టర్ల హెల్త్ బులెటిన్
అప్పటికే అక్కడ ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ మరియు మేనల్లుడు, రాజ్యసభ ఎంపి సంతోష్ కుమార్ తదితరులు....
Hyderabad, April 22: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు కోవిడ్ లక్షణాలు తగ్గిపోయి, ఆరోగ్యంగా ఉన్నారని డా. ఎం.వి. రావు వెల్లడించారు. గత సోమవారం సీఎం కేసీఆర్‌కు కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పట్నించీ ఆయన హైదరాబాద్ లోని సీఎం క్యాంపు కార్యాలయం అయిన ప్రగతి భవన్‌ను విడిచి సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామంలో గల తన వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సీఎం కేసీఆర్‌ను బుధవారం రాత్రి 7 గంటల సమయంలో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే అక్కడ ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ మరియు మేనల్లుడు, రాజ్యసభ ఎంపి సంతోష్ కుమార్ తదితరులు ఆసుపత్రిలో వేచి ఉన్నారు. సీఎం వ్యక్తిగత వైద్యులు ఎం.వి. రావు ఆధ్వర్యంలో కేసీఆర్‌కు సిటి స్కాన్‌తో పాటు మరో ఐదు రకాల పరీక్షలు నిర్వహించారు. అందులో సిబిపి, కాలేయ పనితీరు పరీక్షలు ఉన్నాయి. సీఎం ఊపిరితిత్తులు సాధారణంగా ఉన్నాయని, ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని డాక్టర్లు వెల్లడించారు.
బుధవారం సీఎం కేసీఆర్‌ను యశోద ఆసుపత్రికి తరలిస్తున్నారనే వార్తతో ప్రజల్లో ఆందోళన చెందకుండా, ఆయన ఆరోగ్యానికి సంబంధించి అధికారిక హెల్త్ బులెటిన్‌ను అధికార యంత్రాంగ విడుదల చేసింది. అదే విధంగా సీఎం కూడా యశోద ఆసుపత్రి వద్ద ఎప్పట్లాగే సాధారణంగా ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు. కొద్దిగా జలుబు మినహా తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఉదయం వ్యవసాయ క్షేత్రంలో మార్నింగ్ వాక్ కూడా చేస్తున్నట్లు వైద్యులకు కేసీఆర్ చెప్పినట్లుగా అక్కడి సిబ్బంది తెలిపారు.
ముఖ్యమంత్రికి యశోద ఆసుపత్రిలో కేవలం అర్ధ గంటలోనే అన్ని వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి నేరుగా తన ఫామ్ హౌజ్‌కి వెళ్లిపోయారు. సమాచారం ప్రకారం కేసీఆర్ మరో వారం రోజుల పాటు ఆ వ్యవసాయ క్షేత్రంలోనే ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు తెలిసింది. అక్కడే ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించే వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండనున్నారు.