TS Cabinet Meet Highlights: ఆర్టీసీ డిమాండ్లను పరిశీలించేందుకు కమిటీ వేసిన ప్రభుత్వం, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం, కేబినేట్ మీటింగ్ ముఖ్యాంశాలు ఇవే
గ్రామాల్లో ప్రస్తుతం అమలవుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై చర్చించడానికి ఈ నెల 10న ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు, కలెక్టర్లతో హైదరాబాద్ లో విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది...
Hyderabad, October 02: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించింది. మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్ (K. Chandrashekhar Rao) అధ్యక్షతన సమావేశమైన కేబినేట్ (Telangana Cabinet), పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. దాదాపు ఏడున్నడ గంటల పాటు ఈ భేటీ సాగింది. ఆర్టీసీ కార్మికులు వివిధ డిమాండ్లతో సమ్మెకు (TSRTC Strike) సిద్ధమైన నేపథ్యంలో, వారి డిమాండ్లను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కోసం ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారులతో కూడిన ఒక కమిటీని నియమిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. సోమేశ్ కుమార్ అధ్వర్యంలోని ఈ కమిటీ బుధవారం ఆర్టీసీ కార్మికులతో చర్చిస్తుంది.
సామాన్య ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. అధికారుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆర్టీసీ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి నిర్ణయించింది.
ఆర్టీసీ ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్నందున, సమ్మె యోచన విరమించుకుని సహకరించాలని కార్మికులకు రాష్ట్ర మంత్రి మండలి విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే తమ డిమాండ్లు చెప్పారని, ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీతో చర్చించాలని కేబినెట్ సూచించింది. డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా సంస్థను కాపాడాలనే కృతనిశ్చయంతో ఉందని కేబినెట్ స్పష్టం చేసింది. ఈ సమయంలో సమ్మెకు పోయి కార్మికులు సొంత సంస్థనే నష్టపరచవద్దని విజ్ఞప్తి చేసింది. కూర్చున్న కొమ్మనే నరుక్కోవద్దని మంత్రి మండలి కోరింది. ప్రజలంతా పండుగలకు తమ సొంతూర్లకు పోయే సందర్భంలో సమ్మెకు పోయి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని కార్మికులను మంత్రి మండలి కోరింది.
ఇక ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తగు సూచనలు చేసేందుకు, ఆయా శాఖల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను పరిశీలించేందుకు శాశ్వత ప్రాతిపదికన మంత్రివర్గ ఉప సంఘాలను నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విధానం, పౌల్ట్రీ పాలసీ రూపొందించాలని కేబినెట్ నిర్ణయించింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘాలు
మొదటగా.. వైద్య, ఆరోగ్య కమిటి: రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వివిధ సీజన్లలో వచ్చే అంటువ్యాధులు, ఇతరత్రా వ్యాధులు, ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
గ్రామీణ పారిశుధ్య కమిటి: ప్రస్తుతం అమలవుతున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు మరియు భవిష్యత్తులో గ్రామాల్లో పారిశుధ్య పనులను పర్యవేక్షించడం కోసం గ్రామీణ పారిశుధ్య కమిటిని నియమించింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అవసరమైన కార్యాచరణను అమలు చేసే విషయంలో ఈ కమిటీ అప్రమత్తంగా ఉంటుంది.
పట్టణ పారిశుధ్య కమిటి: పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అమలు చేసే కార్యాచరణను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
వనరుల సమీకరణ కమిటి: రాష్ట్ర స్థాయిలో వనరులను సమీకరించుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
పచ్చదనం కమిటి: తెలంగాణలో పచ్చదనం పెంచడం, అడవులు కాపాడడం, కలప స్మగ్లింగును అరికట్టడం తదితర కార్యక్రమాలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది.
వ్యవసాయ కమిటి: సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, కల్తీలను నిరోధించడం, వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను అమలు చేయడం, విత్తనాలను, ఎరువులను సేకరించడానికి ఒక సమగ్ర విధానం రూపొందించడం తదితర కార్యక్రమాలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడం తదితర కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తుంది.
పౌల్ట్రి కమిటి: రాష్ట్రంలో చాలా మంది ఆధార పడిన పౌల్ట్రి పరిశ్రమను పటిష్ట పరచడానికి అవసరమైన పౌల్ట్రి పాలసీ తీసుకురావడంతో పాటు, పౌల్ట్రీ అభివృద్ధికి తీసుకునే చర్యలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది. మంచి పౌల్ట్రీ పాలసీ ఉన్న రాష్ట్రాల్లో పర్యటించి ఈ కమిటీ అధ్యయనం కూడా చేస్తుంది.
సంక్షేమ కమిటి: వివిధ వర్గాల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను ఈ కమిటి పర్యవేక్షిస్తుంది.
రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ రంగ పరిస్థితిని మంత్రివర్గ సమావేశం విస్తృతంగా చర్చించింది. వర్షాకాలంలో పండిన అన్ని రకాల పంటలను ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయడానికి పౌర సరఫరాల సంస్థతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు సన్నద్ధం కావాలని మంత్రి మండలి కోరింది. వేసవి కాలం పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను ముందుగానే సమీకరించుకోవాలని సూచించింది. దీనికి అవసరమైన విధానం రూపొందించుకోవాలని చెప్పింది.
గ్రామాల్లో ప్రస్తుతం అమలవుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై చర్చించడానికి ఈ నెల 10న ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు, కలెక్టర్లతో హైదరాబాద్ లో విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. గ్రామాల్లో పారిశుధ్యం కాపాడడానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు, భవిష్యత్తులో చేయాల్సిన పనులపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)