Telangana Minister Uttam Kumar Reddy (Photo-ANI)

Hyd, Feb 27: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌ను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని భారీ నీటిపారుదలశాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ సహాయ చర్యలను వేగవంతం చేసినట్టు చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీ పరిజ్ఞానాన్ని వినియోగించి సహాయ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని వెల్లడించారు.టన్నెల్‌ కూలిపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమేనని ఉత్తమ్‌ ఆరోపించారు.

రెస్క్యూ టీమ్‌లు రెండు రోజుల్లో టన్నెల్‌లో (SLBC Tunnel Collapse Update) చిక్కుకున్న వారిని వెలికితీయడానికి కార్యాచరణం సిద్ధం చేశామని వివరించారు. బుధవారం ఎస్‌ఎల్‌బీసీ క్యాంప్‌ కార్యాలయం వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ మల్లురవి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలను రక్షించేందుకు దేశంలోని టన్నెల్‌ నిష్ణాతులందరినీ రప్పించామని, అత్యాధునిక సదుపాయాలు ఉపయోగిస్తున్నామని మంత్రి (Minister Uttam Kumar Reddy) తెలిపారు.

ఆరు రోజులైనా సీఎం రేవంత్ రెడ్డి రాలేదు, ఎన్నికల ప్రచారం ముఖ్యమా? ఎనిమిది మంది ప్రాణాలు కాపాడటం ముఖ్యమా? ప్రశ్నించిన హరీష్ రావు

గత ప్రభుత్వం టన్నెల్‌లో నీటి తొలగింపు పనులు కూడా చేపట్టలేదని మండిపడ్డారు. టన్నెల్‌లో నీటిని తోడివేసి ఉంటే.. ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. గ్రావిటీ ద్వారా 30 టీఎంసీలు తీసుకునే ప్రాజెక్టును పక్కకు పెట్టారు. టన్నెల్‌ పూర్తి చేసి ఉంటే 4.50 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవి. బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టులన్నీ వాళ్ల జేబులు నింపుకొనేందుకే అని విమర్శలు గుప్పించారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కడితే అది మూడేళ్లకే కూలింది. గతంలో శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ అగ్ని ప్రమాదంలో ఆరుగురు ఉద్యోగులు చనిపోతే కనీసం వెళ్లి చూడలేదు. పాలమూరు పంప్‌హౌస్‌లో ప్రమాదం జరిగి ఆరుగురు చనిపోతే స్పందించలేదు.

కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే.. నాడు కేసీఆర్‌ వెళ్లలేదు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ దగ్గర్లోనే మాసాయిపేట రైలు ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో చిన్నారులు చనిపోతే కేసీఆర్‌ కనీసం పరామర్శించలేదు. ప్రమాదం జరిగిన చోట రాజకీయం చేయడానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వచ్చారు. హరీశ్‌రావుకు అనుభవం ఉంటే పదేళ్లలో ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు. నిపుణుల చర్యలకు ఇబ్బంది కావొద్దని అందరినీ లోపలికి పంపట్లేదు.

టీబీఎం వెనుక ఉన్న బురద తొలగింపు పనులు జరుగుతున్నాయి. బురద తొలగింపు పూర్తికాగానే మిషన్‌ శిథిలాలు తొలగిస్తాం’’ అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. టన్నెల్‌లో (SLBC Tunnel Collapse) చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆశలు వదులుకోలేదని, వారిని సజీవంగా బయటకు తీసుకురావాలన్న ఆశతో సహాయ చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. టన్నెల్‌లో ప్రమాద ఘటన ప్రాంతంలో 15 ఫీట్ల ఎత్తు 200 మీటర్ల మేర బురద పేరుకుపోయి ఉండడంతో సహాయ చర్యలు నెమ్మదించాయని తెలిపారు. టన్నెల్‌లోని నీటిని భారీ పంపులతో బయటికి పంపడం, బురదను తొలగించడం ద్వారా టీబీఎం ముందుభాగానికి చేరుకోనున్నట్టు చెప్పారు. టీబీఎం చివరి భాగాలను గ్యాస్‌, ప్లాస్మా కట్టర్లతో తొలగించనున్నట్టు వివరించారు.