Elon Musk on WhatsApp: ప్రతి రోజు రాత్రి మీ డాటా దొంగిలిస్తున్నారు! వాట్సాప్ పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు, ఇంకా స్పందించని మెటా
‘ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్’ ఫీచర్ ఉండటమే దీనికి కారణం. అయితే, వాట్సాప్‌లో (WhatsApp) కూడా యూజర్ల డాటాకు భద్రత లేదని స్పేస్ ఎక్స్, టెస్లా, ఎక్స్ తదితర దిగ్గజ కంపెనీల సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఆరోపించారు
New York, May 26: సాధారణ ఫోన్ కాల్స్‌ను ట్యాపింగ్ (Tapping) చేసే అవకాశాలు ఉంటాయని చాలా మంది ముఖ్యమైన ఫోన్ కాల్స్‌ను, మెసేజ్‌లను వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ‘ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్’ ఫీచర్ ఉండటమే దీనికి కారణం. అయితే, వాట్సాప్‌లో (WhatsApp) కూడా యూజర్ల డాటాకు భద్రత లేదని స్పేస్ ఎక్స్, టెస్లా, ఎక్స్ తదితర దిగ్గజ కంపెనీల సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఆరోపించారు. ప్రతి రోజు రాత్రి యూజర్ల డాటాను వాట్సాప్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు. యూజర్ల సమాచారాన్ని ప్రతి రోజు రాత్రి వాట్సాప్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నదని, ఈ సమాచారాన్ని విశ్లేషించిన తరువాత అడ్వైర్టెజ్‌మెంట్ కోసమని వాడుకొంటున్నదని ఎక్స్‌లో ఓ యూజర్ పోస్ట్ చేశాడు.
యూజర్లను వాట్సాప్ కంపెనీ ఓ కస్టమర్‌గా కాకుండా ఓ వస్తువుగా చూస్తున్నదని మండిపడ్డాడు. దీనిపై స్పందించిన మస్క్.. ‘ప్రతి రోజు రాత్రి మీ డాటాను వాట్సాప్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నది. కానీ, కొంతమంది ఇంకా వాట్సాప్‌లో తమ డాటా భద్రంగానే ఉన్నదన్న భ్రమలో ఉన్నారు’ అని బదులిచ్చారు. అయితే, మస్క్ వ్యాఖ్యలపై అటు వాట్సాప్ గానీ, దాని పేరెంట్ కంపెనీ మెటా గానీ ఇంకా స్పందించలేదు. కాగా, మెటా, వాట్సాప్‌లపై గతంలోనూ మస్క్ ఇలాంటి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.