Track Your Phone Via CEIR: మొబైల్ పోయిందనే బెంగను వదిలేయండి ,ఇకపై సీఈఐఆర్ ద్వారా దాన్ని ట్రాక్ చేయవచ్చు, గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

ఇందులో భాగంగానే ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో పైలట్‌ ప్రాజెక్టుగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Government launches new Web portal to track lost or stolen phones ( Photo credit -Pixabay )

New Delhi, September 17: మనం ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కున్న మొబైల్ పోతే ఎంతో బాధపడిపోతుంటాం, ఆ ఫోన్ ఎవరైనా దొంగిలించినప్పుడు అందులో ఉన్న డేటా ఏమైపోతుందోననే భయంతో పాటు, ముఖ్యమైన సమాచారం తస్కరిస్తారనే ఆందోళన కలగడం సహజం. ఇక అందులో బ్యాంకుకి సంబంధించిన సమాచారం ఉంటే అంతే సంగతులు. ఇకపై మీరు మీ మొబైల్ పోతే బాధపడనవసరం లేదు. పోయిన వెతికి తీసుకువచ్చేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ( Department of Telecommunications)కొత్త ప్రాజెక్టును త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో పైలట్‌ ప్రాజెక్టుగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ www.ceir.gov.in అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు.

కొత్త ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది

దీని ద్వారా ఎవరి ఫోన్ అయినా పోయిందో వారు ముందుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లెయింట్ ఇచ్చి ఎఫ్‌ఐఆర్ కాపీ తీసుకోవాలి. ఆ తరువాత 14422 డాట్ (DoT) నంబర్‌కు ఫోన్ చేసి తమ ఫోన్ పోయిన విషయాన్ని, పోలీసులకు కంప్లెయింట్ చేసిన విషయాన్ని చెప్పాలి. వారు వెరిఫై చేసి ఆ ఫోన్‌కు చెందిన ఐఎంఈఐ (International Mobile Equipment Identity) నంబర్ తెలుసుకుని దాని సహాయంతో ఆ ఫోన్‌ను బ్లాక్ లిస్టులో పెడతారు. ఆ వివరాలను టెలికాం ఆపరేటర్లకు ఇస్తారు. దాంతో ఆపరేటర్లు ఆ బ్లాక్‌లిస్టులో ఉన్న ఐఎంఈఐ (IMEI) నంబర్ ప్రకారం ఆ ఫోన్‌ను ఎవరైనా వేరే సిమ్‌తో వాడుతుంటే వెంటనే ఫోన్‌ను బ్లాక్ చేస్తారు. అంతేకాదు, ఆ సమయంలో ఆ ఫోన్ ఎక్కడ ఉందో దాన్ని ఆపరేటర్లు ట్రాక్ చేసి పోలీసులకు ఇన్‌ఫాం చేస్తారు. పోలీసులు వెంటనే అలర్ట్ అయి ఫోన్‌ను రికవరీ చేస్తారు.

మహారాష్ట్రలో తొలి అడుగు

ప్రస్తుతానికి మహారాష్ట్రలోనే ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఇఐఆర్) Central Equipment Identity Register (CEIR)పేరుతో మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్టుగా, బిఎస్‌ఎన్‌ఎల్ సహకారంతో దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ సీఈఐఆర్ గ్లోబల్ ఐఎమ్ఈఐ డేటాబేస్ కు అనుసంధానమై ఉంటుంది. దీని ద్వారా డేటాబేస్‌లో ఉన్న ఇత‌ర‌ IMEI సంఖ్యలతో పోల్చి నకిలీ హ్యాండ్‌సెట్‌లను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కు బీఎస్ఎన్ఎల్ ( BSnl),రిలయన్స్ జియో ( Jio ), ఎయిర్టెల్, ( Airtel ) వోడాఫోన్ ( Vodafone ), ఐడియా (Idea ) లాంటి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ డాట్‌కు సహకారం అందించనున్నాయి.

కాగా 2017 నుంచి డాట్ దేశంలోని వినియోగదారులకు చెందిన ఫోన్ల ఐఎంఈఐ నంబర్లను సేకరించి తన డేటాబేస్‌లో భద్ర పరుస్తోంది. దాని స‌హాయంతోనే ఈ ప్రాజెక్టును చేప‌ట్టారు. అయితే ఈ సౌకర్యం ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందో డాట్ వెల్లడించలేదు. త్వరలోనే దేశ వ్యాప్తంగా సెల్‌ఫోన్ వినియోగదారులకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.