Satya Nadella: మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్‌గా సత్య నాదేళ్ల నియామకం, ఇప్పటికే ఉన్న సీఈఓ పోస్టుకు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు, ప్రస్తుత చైర్మన్‌ను స్వతంత్ర డైరెక్టర్ పోస్టుకు మారుస్తూ బోర్డ్ ఏకగ్రీవ తీర్మానం

ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బోర్డుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్ స్థానాన్ని కంపెనీకి ఇప్పటికే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్లకు...

Satya-nadella-microsoft (Photo-PTI)

Washington, June 17: టెక్ జియాంట్ మైక్రోసాఫ్ట్ సిఈఒ సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ సంస్థకు చైర్మన్‌గా నియమింపబడ్డారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బోర్డుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్ స్థానాన్ని కంపెనీకి ఇప్పటికే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్లకు బదలాయిస్తూ చేసిన తీర్మానానికి బోర్డ్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఇకపై జాన్ థాంప్సన్ స్వతంత్ర డైరెక్టర్ పోస్టులో కొనసాగనున్నారు.  సత్య నాదెళ్ల ఇక ముందు మైక్రోసాఫ్ట్ సిఈఒతో పాటుగా కంపెనీ ఛైర్మన్‌గా బోర్డు కోసం ఎజెండాను ఖరారు చేస్తూ, బోర్డుకు నాయకత్వం వహించే అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో,  "కొత్త ఛైర్మన్‌గా సత్య నాదెళ్ల బోర్డు కోసం ఎజెండాను నిర్ణయించే పనికి నాయకత్వం వహిస్తారు, ఇది సంస్థ వ్యాపారాభివృద్ధికి సరైన వ్యూహాత్మక అవకాశాలను పెంచడానికి మరియు బోర్డు యొక్క సమీక్ష కోసం కీలకమైన నష్టాలు మరియు ఉపశమన విధానాలను గుర్తించడానికి తన లోతైన అవగాహనను పెంచుతుంది. లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా, బోర్డు ఎజెండాలపై స్వతంత్ర డైరెక్టర్ల తరపున ఇన్పుట్ అందించడం, స్వతంత్ర డైరెక్టర్లను సమావేశాలకు ఆహ్వానించడం, ఎగ్జిక్యూటివ్ సెషన్ల కోసం ఎజెండాలను ఖరారు చేయడంతో పాటుగా CEO బాధ్యతల అధికారాలను కలిగి ఉంటారు".

స్టీవ్ బాల్‌మెర్ నుండి 2014 లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన నాదెల్లా, లింక్డ్ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, మరియు జెనిమాక్స్ వంటి కంపెనీలతో బిలియన్ డాలర్ల కొనుగోళ్ల ఒప్పందాలతో మైక్రోసాఫ్ట్ వ్యాపారాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషించారు. నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టాక మైక్రోసాఫ్ట్ కంపెనీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త తరం టెక్నాలజీ దిశగా మైక్రోసాఫ్ట్ ముందుకు దూసుకెళ్లింది.