RBI Guidelines: మినిమం బ్యాలెన్స్ లేకపోతే చార్జీలు వేయొద్దు, బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు, అన్ క్లైయిమ్డ్ డిపాజిట్లపై పలు సూచనలు చేసిన రిజర్వ్ బ్యాంక్
రెండేండ్లకుపైగా ఎటువంటి లావాదేవీలు లేకుండా ఇన్ ఆపరేటివ్‌గా ఉన్న ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ (minimum balance charges) లేదంటూ చార్జీలను వేయవద్దని బ్యాంకులను బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది.
Mumbai, JAN 04: రెండేండ్లకుపైగా ఎటువంటి లావాదేవీలు లేకుండా ఇన్ ఆపరేటివ్‌గా ఉన్న ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ (minimum balance charges) లేదంటూ చార్జీలను వేయవద్దని బ్యాంకులను బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది. అలాగే స్కాలర్‌షిప్ నగదును పొందడం కోసం లేదా ప్రత్యక్ష నగదు బదిలీల కోసం తీసుకున్న ఖాతాల్లో రెండేండ్లకుపైగా ఎలాంటి లావాదేవీలు జరుగకున్నా.. వాటిని ఇన్‌ఆపరేటివ్ ఖాతాలుగా (inoperative accounts) పేర్కొనరాదనీ స్పష్టం చేసింది. అన్‌క్లెయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్లను తగ్గించే చర్యల్లో భాగంగా, ఇన్‌ఆపరేటివ్ ఖాతాలపై విడుదల చేసిన తాజా సర్క్యులర్‌లో బ్యాంకులకు ఆర్బీఐ ఈ సూచనలు చేసింది.
ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ‘బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించడానికి, సదరు డిపాజిట్లు వాటి నిజమైన హక్కుదారులు/యజమానులు/వారసులకు చేరడానికి బ్యాంకులు, ఆర్బీఐ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలకు ఈ కొత్త మార్గదర్శకాలు కలిసొస్తాయని ఆశిస్తున్నాం’ అని ఈ సందర్భంగా సర్క్యులర్‌లో ఆర్బీఐ పేర్కొన్నది.
నూతన మార్గదర్శకాలివి!
ఈ నూతన నిబంధనల ప్రకారం ఇన్‌ఆపరేటివ్‌గా మారుతున్న ఖాతాల సమాచారాన్ని వాటి నిర్వహణదారులకు ఎస్‌ఎంఎస్, లేఖలు, ఈమెయిల్ ద్వారా బ్యాంకులు తెలియపర్చాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతాదారుడు స్పందించకపోతే బ్యాంక్‌కు తొలుత ఆ ఖాతాదారున్ని పరిచయం చేసిన వ్యక్తినిగానీ, ఖాతాదారు నామినీనిగానీ బ్యాంక్ సంప్రదించాలని రూల్స్ చెప్తున్నాయి. వాడుకలోలేని ఖాతాలను తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు సదరు ఖాతాదారుల నుంచి బ్యాంకులు ఎలాంటి చార్జీలను వసూలు చేయరాదు.