From 8 Days To 8 Months: 8 రోజుల్లో వస్తారనుకుంటే.. 8 నెలలు కానుంది.. సునీతా విలియమ్స్ భూమికి తిరిగివచ్చే సమయాన్ని ప్రకటించిన నాసా.. ఎప్పుడంటే?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒకవిధంగా చిక్కుకుపోయిన ఇద్దరు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ తిరిగి భూమికి చేరడానికి ఇంకా సమయం పట్టనుందని నాసా తెలిపింది.
Newdelhi, Aug 25: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒకవిధంగా చిక్కుకుపోయిన ఇద్దరు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్ మోర్ (Butch Wilmore) తిరిగి భూమికి చేరడానికి ఇంకా సమయం పట్టనుందని నాసా తెలిపింది. స్పేస్ ఎక్స్ కు చెందిన క్య్రూ డ్రాగన్ క్యాప్సుల్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారు బయలుదేరుతారని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ తెలిపారు. ఇప్పటికే, రెండు నెలలుగా అక్కడ ఉన్న వాళ్లు..మరో ఆర్నెళ్ల పాటు స్పేస్ స్టేషన్ లో ఉండి మరిన్ని పరిశోధనలు, నిర్వహణ, సిస్టమ్ టెస్టింగ్ చేయనున్నట్టు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే?
బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ లో అమెరికాలోని ప్లోరిడా నుంచి ఈ ఏడాది జూన్ 5న నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. జూన్ 6వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వ్యోమగాములు చేరుకున్నారు. అయితే, వారు ఎనిమిది రోజుల్లో భూమిపైకి తిరిగిరావాల్సి ఉన్నప్పటికీ.. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ యాత్రలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాహక నౌక థ్రస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిణమించింది. దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది. అప్పటి నుంచి సమస్యను పరిష్కరించేందుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.