Twitter Update: ట్విట్టర్‌లో క్రేజీ అప్‌డేట్, ఇకపై రెండుగంటల వీడియో అప్‌లోడ్ చేసుకోవచ్చు, వారికి మాత్రమే అంటూ మెలికపెట్టిన ఎలాన్ మస్క్
ట్విట్టర్ పోస్టుల్లో లాంగ్ వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చునని మస్క్ ప్రకటించాడు. అంటే.. ట్విట్టర్ ప్లాట్‌ఫారంలో రెండు గంటలు లేదా 8GB వరకు నిడివి ఉన్న లాంగ్ వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు.
New Delhi, May 19: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) యూజర్ల కోసం కంపెనీ ప్రస్తుత సీఈఓ, బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) కొత్త ఆఫర్ ప్రకటించాడు. ట్విట్టర్ పోస్టుల్లో లాంగ్ వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చునని మస్క్ ప్రకటించాడు. అంటే.. ట్విట్టర్ ప్లాట్‌ఫారంలో రెండు గంటలు లేదా 8GB వరకు నిడివి ఉన్న లాంగ్ వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ట్విట్టర్ యూజర్లందరికి కాదండోయ్.. మస్క్ ఏం చేసినా దానికో లెక్క ఉంటుంది.. మస్క్ ఏది అంత ఈజీగా ఇవ్వడు అనేదానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.. లాభం లేకుండా మస్క్ ఏ పని చేయడు. అందులో కచ్చితంగా ఏదో ఒక లాభం ఉండి తీరాల్సిందే.. ఇప్పుడు అదే చేశాడు.. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు (Twitter Blue subscribers)కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందంటూ చివరిలో మస్క్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ మేరకు మస్క్ ట్విట్టర్ వేదికగా ఇలా ట్వీట్ చేశాడు.. ‘ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు ఇప్పుడు 2 గంటలు లేదా 8 GB వరకు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు’ అని ప్రకటించారు.
అంటే.. నాన్-ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్ 140 సెకన్ల (2 నిమిషాలు, 20 సెకన్లు) వరకు మాత్రమే వీడియోలను అప్‌లోడ్ చేసుకునే వీలుంది. ఏప్రిల్ 1వ తేదీన ఎలన్ మస్క్ ట్విట్టర్ బ్లూ బ్యాడ్జ్ కోసం సబ్‌స్ర్కిప్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. గతంలో ఈ బ్లూ టిక్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితంగా అందించేది. మస్క్ వచ్చిన తర్వాత పేమెంట్ సర్వీసుగా మారింది.
ఇప్పుడు బ్లూ టిక్ మార్క్‌ని పొందాలంటే ట్విట్టర్ యూజర్లు నెలకు 8 డాలర్లు లేదా సంవత్సరానికి 84 డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. భారతీయ ట్విట్టర్ యూజర్లు వెబ్‌సైట్, మొబైల్‌లో నెలకు రూ. 650, రూ. 900 చొప్పున బ్లూ బ్యాడ్జ్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు.