Same-Sex Marriage Act: విప్లవాత్మక బిల్లుకు అమెరికా అమోదం, సేమ్‌ సెక్స్ మ్యారేజ్‌ బిల్లుపై జో బైడెన్ సంతకం, ఇకపై అక్కడ స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ

ఇవాళ అమెరికా సమానత్వం దిశగా మరో అడుగు వేసింది. స్వేచ్ఛ, న్యాయం కొందరికే సొంతం కాదు, అందరికీ అనే దిశగా మరో నిర్ణయం తీసుకుంది. ఏ విధంగానంటే, ఇవాళ నేను సేమ్ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ బిల్లుపై సంతకం చేశాను’ అని ట్వీట్‌ చేశారు.

US President Joe Biden (Photo Credit: Twitter/@POTUS)

Washington, DEC 14: అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించే బిల్లు (law to protect same-sex marriages) చట్టరూపం దాల్చింది. ఇప్పటికే అమెరికా సెనేట్‌లో, ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఆ బిల్లుపై మంగళవారం అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం (Biden signs) చేశారు. దాంతో బిల్లు చట్టంగా మారింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌.. ‘ఇది చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ అమెరికా సమానత్వం దిశగా మరో అడుగు వేసింది. స్వేచ్ఛ, న్యాయం కొందరికే సొంతం కాదు, అందరికీ అనే దిశగా మరో నిర్ణయం తీసుకుంది. ఏ విధంగానంటే, ఇవాళ నేను సేమ్ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ బిల్లుపై సంతకం చేశాను’ అని ట్వీట్‌ చేశారు. ‘మీలో చాలా మంది సౌత్‌ లాన్‌లో నిలబడి ఉన్నారు. నేను ఇప్పుడు సంతకం చేసిన చట్టం కోసం జరిగిన పోరాటంలో మీలో ఎందరో మీ బంధాలను వదులుకున్నారు. మీ ఉద్యోగాలను విడిచిపెట్టారు. మీ జీవితాలను ఫణంగాపెట్టారు’ అని బిల్లుపై సంతకం సందర్భంగా అధ్యక్షుడు బైడెన్‌ (Biden) వ్యాఖ్యానించినట్లు ది హిల్‌ వార్తాపత్రిక తన కథనంలో పేర్కొన్నది.

ముందుగా స్వలింగ సంపర్కుల వివాహాలకు (same-sex marriages) వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుందన్న ఆందోళనతో.. అమెరికన్ సెనేట్ ఈ సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ బిల్లుకు (law to protect same-sex marriages) ఆమోదం తెలిపింది. అధికార డెమోక్రాట్ పార్టీతోపాటు కొందరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దాంతో బిల్లుకు సెనేట్‌లో సులువుగా గ్రీన్ సిగ్నల్ లభించింది. స్వలింగ సంపర్కుల వివాహ రక్షణ బిల్లు సెనేట్‍లో ఆమోదం పొందినప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Joe Biden) సంతోషం వ్యక్తంచేశారు. ఈ సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ చట్టాన్ని అందరూ గౌరవించాలని, ప్రేమ ఎవరిదైనా ప్రేమే అనే ప్రాథమిక నిజాన్ని చాటిచెప్పేందుకు అమెరికా సమీపంలో ఉందని, ఇష్టపడే వారిని విహహం చేసుకునే హక్కు అమెరికన్లకు ఉండాలని ఆ సందర్భంగా బైడెన్ వ్యాఖ్యానించారు.

సెనేట్‍లో ఆమోదం పొందిన స్వలింగ సంపర్కుల వివాహ రక్షణ బిల్లు ఆ తర్వాత ప్రతినిధుల సభకు చేరింది. అక్కడ కూడా ఈ చట్టానికి ఆమోదముద్ర పడింది. ప్రతినిధుల సభ ఆమోదం తర్వాత బిల్లును సంతకం కోసం అధ్యక్షుడు బైడెన్‌ దగ్గరికి పంపించారు. తాజాగా ఆయన సంతకం కూడా పూర్తవడంతో సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్ కార్యరూపంలోకి వచ్చినట్లయ్యింది.