Pak Reaction: కాశ్మీర్ అంశం పట్ల పాక్ ప్రధాని స్పందన. మోడీ సర్కారుకు ఎన్నడూ లేనంత 'దీటైన జవాబు' ఇస్తామని వ్యాఖ్య! పాకిస్థాన్ ఏం చేయబోతుంది? ఏం చేయగలదు?

ఆ ప్రాంతం పట్ల అంతర్జాతీయ వివాదాలు ఉన్నాయి. దానిని భారత్ ఏకపక్షంగా...

జమ్మూకాశ్మీర్‌ను మోడీ ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతం చేయడం పట్ల పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తన కడులో మంటను బయటపెటాడు. కాశ్మీర్‌ను యూటీ (UT) చేయడం అటు కాశ్మీరీలకు గానీ, ఇటు పాకిస్థానీయులకు గానీ ఎంతమాత్రం ఇష్టం లేదని పేర్కొన్నాడు. దీనివల్ల కాశ్మీరీల భవితవ్యం ఏమీ మారబోదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్‌ను మోడీ ప్రభుత్వం యూటీగా మార్చటాన్ని ఆయన ఖండించారు.

ఇదివరకు ఎన్నడూ లేనంతగా 'దీటైన జవాబు'ను మోడీ సర్కారుకు ఇవ్వాలనే ధృడ నిశ్చయంతో ఆయన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

త్వరలోనే ఇమ్రాన్ ఖాన్ తన మంత్రివర్గంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కాశ్మీర్‌కు సంబంధించి భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల చర్చించనున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

పాకిస్థాన్ మొండి వాదన ఇదీ..

పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రి మాట్లాడుతూ "భారత్ అక్రమంగా ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతం అంతర్జాతీయ భూభాగ పరిధిలోకి వస్తుంది. ఆ ప్రాంతం పట్ల అంతర్జాతీయ వివాదాలు ఉన్నాయి. దానిని భారత్ ఏకపక్షంగా తమ కేంద్రప్రాంత పాలిత ప్రాంతంగా మార్చుకోవటం అనైతికం. జమ్మూ కాశ్మీర్‌ను యూటీగా మార్చుకునే హక్కు భారతదేశానికి లేదు, అలా మార్చేయడం కాశ్మీరీలకు మరియు పాకిస్థానీలకు ఇష్టం లేదు." అని వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్ బాధ ఏంటి?

పాకిస్థాన్ ఎప్పుడూ కూడా భారత్‌ను నేరుగా ఎదుర్కునే సాహసం చేయదు. అలా చేస్తే తమ గతి ఏమవుతుందో పాకిస్థాన్‌కు బాగానే తెలుసు. అందుకే భారత్‌పై పైచేయి సాధించడం కోసం దొడ్డిదారిలో ఏమైనా అవకాశాల కోసం వెతుక్కుంటుంది.  చైనా లేదా అమెరికా నీడలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. అలాగే స్వయంప్రతిపత్తి హోదా గల జమ్మూకాశ్మీర్‌లోని పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంది. జమ్మూకాశ్మీర్ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మతం పేరుతో, డబ్బు , ఇతర ఆశలు చూపుతూ అక్కడ ప్రజలను ఉసిగొల్పుతుంది. కాశ్మీర్ భౌగోళిక స్వరూపం కూడా పాకిస్థాన్‌కు అనుకూలంగా పరిణమించింది. ఇక్కడ అంతా కొండప్రాంతం కావడంతో మెజారిటీ కశ్మీరీ కుటుంబాలు సరిహద్దుకు అనుకునే నివాసం ఉంటున్నాయి.

తన సైన్యంతో సమానంగా ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించే పాకిస్థాన్ తన ఉగ్రవాదులను వయా కాశ్మీర్ నుంచి భారత్‌లోకి నేరుగా, సులభంగా ప్రవేశపెడుతూ వస్తుంది. జమ్మూకాశ్మీర్‌కు ఉన్న స్పెషల్ స్టేటస్ కారణంగా నిజమైన, శాశ్వతమైన భారత పౌరులు ఎవరనేది నిర్ణయించే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండకపోయేది. ఇప్పుడు మోడీ సర్కార్ ఆ 'స్వయం ప్రతిపత్తిని' ఊడగొట్టడంతో పాకిస్థాన్‌తో ఎలాంటి యుద్ధం లేకుండానే ఆ దేశానికి సున్నితంగా ఒక దెబ్బ తగిలించినట్లయింది. అందుకే దీటైన జవాబు ఇస్తాం, ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేస్తాం, ఏదో చేసేస్తాం అంటూ భారీ వ్యాఖ్యలు చేస్తుంది.

నిజానికి పాకిస్థాన్ ఏం చేయగలదు?

అంతర్జాతీయ కోర్టులో భారత్‌ను నిలదీస్తాం అని పాకిస్థాన్ పైకి ప్రకటిస్తున్నా దాని వాదనలో పస లేదు. ఎందుకంటే ఇప్పుడు భారత్ ఏం చేసింది? తన దేశంలోని ఒక రాష్ట్రాన్ని, తమ ఆధీనంలో ఉన్న భూభాగాన్నే కేంద్ర ప్రాంతపాలిత ప్రాంతంగా మార్చేసుకుంది. కాబట్టి పాకిస్థాన్ ఎంత అడ్డగోలుగా వాదించినా అది చెల్లదు. అయితే తన వాదనకు బలం చేకూర్చేందుకు 'కాల్పుల విరమణ ఒప్పందం' తెరపైకి తీసుకురానుందని తెలుస్తుంది. భారత్ - పాక్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులను నిషేధిస్తూ ఐక్యరాజ్య సమితి 1949లో ఇరుదేశాల మధ్య ఒక ఒప్పందాన్ని కుదురించింది. అయితే  తానే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ రివర్స్‌లో భారత్ 'ఉల్లంఘించింది' అని ఎప్పుడూ ఆరోపించే పాకిస్థాన్, ఇప్పుడు ఈ అంశాన్ని మరలా లేవనెత్తి భారత్ చర్యల వల్ల తమ దేశానికి ముప్పు పొంచి ఉందనే వాదనకు దిగే అవకాశం ఉంది ఇది మొదటిది.

రెండోది, ఈ మధ్యనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అవసరమయితే కాశ్మీర్ అంశం పట్ల భారత్ - పాక్ ఇరుదేశాలకు తాను మధ్యవర్తిత్వం వహిస్తాను అని వ్యాఖ్యానించారు. (ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది, తమ అంతర్గత వ్యవహరాలలో జోక్యం చేసుకోవడం తగదని భారత్ స్పష్టం చేసింది, ఇది తెలిసిందే).

ఇప్పుడు ఈ ట్రంప్‌ను కాశ్మీర్ విషయంలో వాడుకునే అవకాశం ఉంది. కాశ్మీర్ విషయంలో ట్రంప్‌ను మధ్యవర్తిత్వం వహించేలా చూడమని ఐక్యరాజ్యసమితికి పాకిస్థాన్ విన్నవించే సూచనలు ఉన్నాయి.

ఇవేవి వర్కవుట్ కాకపోతే తన మార్క్ ఉగ్రవాదాన్నే పాకిస్థాన్ నమ్ముకోవచ్చు. అయితే ఇప్పటికే దూకుడు మీదున్న మోడీ- అమిత్ షా ద్వయాన్ని ఇమ్రాన్ ఖాన్ ఢీకొట్టగలడా? ఇకపై పాకిస్థాన్ ఎలాంటి అడుగులు వేయబోతుందనేది ఆసక్తికరం.