India Strong Warning: చైనాకు వార్నింగ్ ఇచ్చిన భారత్, జమ్మూ కాశ్మీర్‌ను యూటీ చేయటం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన చైనా, తమ వ్యవహారాల్లో చైనా సహా ఏ దేశం జోక్యం చేసుకున్నా సహించమని ఘాటుగా స్పందించిన భారత్
1963 చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని భారత భూభాగాలను చట్టవిరుద్ధంగా చైనా స్వాధీనం చేసుకుంది....
New Delhi : భారతదేశ అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించినందుకుకు చైనా (China) కు భారత్ (India) గట్టి వార్నింగ్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ లను యూటీలుగా చేయడం పట్ల చైనా తీవ్రంగా స్పందించింది. చైనా వ్యాఖ్యల పట్ల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రవీష్ కుమార్ (Raveesh Kumar) ఘాటుగా జవాబిచ్చారు. గురువారం నుంచి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన (Jammu Kashmir Bifurcation) అధికారికంగా అమలులోకి రావడంతో చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విభజన "దుర్మార్గం మరియు చట్ట విరుద్ధం" అంటూ వ్యాఖ్యలు చేసింది.
దీనికి స్పందనగా "భారత్ ఏ దేశం అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు, ఏ దేశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదు. అలాగే భారత్ అంతర్గత వ్యవహారాలలో కూడా చైనా కానీ, వేరే ఏ దేశం కానీ ఎలాంటి జోక్యం చేసుకున్నా, భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా సహించం, జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగం, అది తమ అంతర్గత వ్యవహారం" అని భారత్ బలంగా కౌంటర్ ఇచ్చింది. చైనాపై తిరగబడ్డ హాంకాంగ్ జనం, అమెరికాను మించి అగ్రరాజ్యంగా ఎదగాలనుకుంటున్న చైనా ఆధిపత్యానికి హాంకాంగ్ సెగ
"ఇతర దేశాలు భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాయని మేము ఆశిస్తున్నాము. జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ యూటీలకు చెందిన చాలా భూభాగాన్ని చైనా దురాక్రమణ చేపట్టింది. 1963 చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని భారత భూభాగాలను చట్టవిరుద్ధంగా చైనా స్వాధీనం చేసుకుంది" అని MEA ప్రతినిధి రవీష్ కుమార్ ఘాటుగా స్పందించారు.
ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన దాదాపు మూడు నెలల తరువాత, అక్టోబర్ 31, 2019న సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 144వ జయంతి సందర్భంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అధికారికంగా విభజించబడి జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ అనబడే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా అవతరించాయి.