Nobel Prize Winners 2019: నోబెల్ పురస్కారానికి మరో భారతీయుడు, ఆర్థిక శాస్త్రంలో అమర్త్యసేన్ తరువాత అభిజిత్ బెనర్జీకి నోబెల్ ఫ్రైజ్, అభినందనలు తెలిపిన ప్రముఖులు
2019 ఏడాదికి గాను ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ నోబెల్ పురస్కారం అందుకోనున్నాడు. ఆయన తన భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. వీరిద్దరే కాకుండా మైఖేల్ క్రెమెర్ కూడా ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకోనున్నారు.
Stockholm : ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ పురస్కారానికి మరో భారతీయుడు ఎంపికయ్యాడు. 2019 ఏడాదికి గాను ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ నోబెల్ పురస్కారం అందుకోనున్నాడు. ఆయన తన భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. వీరిద్దరే కాకుండా మైఖేల్ క్రెమెర్ కూడా ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకోనున్నారు. ఆర్థికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ 2019 నోబెల్ ప్రైజ్ ఈ ముగ్గురికి లభించింది. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ ముగ్గురూ కలిసి అనేక పరిశోధనలు చేపట్టారని నోబెల్ కమిటీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.వీరిలో అభిజిత్ బెనర్జీ భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం.
గడిచిన రెండు దశాబ్ధాల్లోనే ఈ ముగ్గురు ప్రతిపాదించిన పరిశోధనా సిద్ధాంతాలు ఆర్థికవ్యవస్థను మార్చేశాయని అభిప్రాయపడ్డారు. ముగ్గురు ప్రతిపాదించిన సిద్దాంతం.. చిన్న చిన్న ప్రశ్నలతో కీలక సమాచారాన్ని సేకరించే విధంగా చేసిందన్నారు.
అవార్డులు ప్రకటన
ఫిబ్రవరి 21, 1961లో అభిజిత్ ముంబైలో జన్మించారు. కోల్‌కత్తా వర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. జవహర్‌లాస్ వర్సిటీ నుంచి పీజీ చేశారు. 1988లో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. క్యాంబ్రిడ్జ్ లోని మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫోర్డ్ ఫౌండేషన్‌లో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. 2003లో అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్‌ను అభిజిత్ ప్రారంభించారు. దాంట్లో డుఫ్లో, సెంథిల్ ములైనాథన్‌లు కూడా ఉన్నారు. ఆ పరిశోధనశాలకు అభిజిత్ డైరక్టర్‌గా ఉన్నారు. యూఎన్ సెక్రటరీ జనరల్‌లోని డెవలప్‌మెంట్ ఎజెండాలోనూ అభిజిత్ సభ్యుడిగా ఉన్నారు.
అవార్డులు అనౌన్స్ చేస్తున్న టీం
ఆర్థిక అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక మ్యాగజీన్స్, జర్నల్స్‌లో వ్యాసాలు రాసిన ఆయన పలు పుస్తకాలు కూడా రాశారు. అభిజిత్ బెనర్జీ 2011లో రాసిన ‘పూర్ ఎకనమిక్స్’ పుస్తకం గోల్డ్‌మన్ శాక్స్ బిజినెస్ బుక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా అందుకుంది.
అభినందనలు తెలిపిన అజిత్ ధోవల్
ఇది కాకుండా ‘వొలాటిలిటీ అండ్ గ్రోత్’, ‘అండర్ స్టాండింగ్ పావర్టీ’ వంటి పుస్తకాలూ రాశారు. 2015 తరువాత అభివృద్ధి అజెండా’కు సంబంధించి ఐరాస సెక్రటరీ జనరల్ హైలెవల్ ప్యానల్‌లోనూ సేవలందించారు.
అభినందనలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ
పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేందుకు కావాల్సిన అనేక అంశాలను వారి సిద్ధాంతంలో ప్రతిపాదించినట్లు నోబెల్ కమిటీ చెప్పింది. వీరి కృషితో కెన్యా లాంటి ప్రాంతంలో పాఠశాల ఫలితాల అభివృద్ధిని మెరుగుపరిచిందన్నారు.
అభినందనలు తెలిపిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
భారత్ లాంటి దేశంలోనూ వీరు ప్రతిపాదించిన ఆర్థిక సూత్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని నోబెల్ కమిటీ తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఈ ముగ్గురు చేసిన ప్రతిపాదనలను విశేషంగా వినియోగిస్తున్నట్లు కమిటీ స్పష్టం చేసింది.
అభినందనలు తెలిపిన మమతా బెనర్జీ
ఈ ముగ్గురు ఆర్థికవేత్తల ప్రతిపాదన వల్ల సుమారు 50 లక్షల మంది భారతీయ చిన్నారులు లబ్ధి పొందినట్లు కూడా నోబెల్ కమిటీ స్పష్టం చేసింది.