Pakistan General Elections 2024: ఎన్నికల వేళ పాకిస్తాన్‌లో మ‌రో ఉగ్ర‌దాడి.. నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి, పోలింగ్‌కు ముందే బయటకు వచ్చిన ఫలితాలు

ఈ దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఉగ్ర‌వాదులు డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో బాంబు దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు

Voting Underway for Pakistan General Elections 2024 (Photo Credit: X/@MehrTarar)

Lahore, Feb 8: పాకిస్తాన్‌లో ఎన్నికలు జ‌రుగుతున్న వేళ మ‌రో ఉగ్ర‌దాడికి టెర్రరిస్టులు పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఉగ్ర‌వాదులు డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో బాంబు దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు ప్ర‌యాణిస్తున్న మొబైల్ వ్యాన్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు ఐఈడీ పేల్చారు.

అనంత‌రం 30 నిమిషాల పాటు కాల్పులు జ‌రిపారు. దీంతో నలుగురు పోలీసులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. పోలింగ్ స్టేష‌న్‌కు స‌మీపంలోనే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఉగ్ర‌వాదుల దాడుల నేప‌థ్యంలో ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపివేశారు.41 మిలియ‌న్ల జ‌నాభా ఉన్న పాకిస్తాన్‌లో 128 మిలియ‌న్ల మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగ‌నుంది.

బలూచిస్థాన్‌లో రెండు చోట్ల భారీ పేలుళ్లు, 25 మంది మృతి..40 మందికి తీవ్ర గాయాలు

పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) (పీఎంఎల్ (ఎన్)) చీఫ్ షెహబాజ్ షరీఫ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని షరీఫ్ లాహోర్‌లోని మోడల్ టౌన్ నియోజకవర్గంలో ఓటు వేశారు.గత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఇమ్రాన్ ఖాన్‌తో పాటు జైలులో ఉన్న ఇతర రాజకీయ ప్రముఖులు జైలు నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు.

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ భార్య బుష్రా బీబీ ఓటు వేయలేకపోయారు. బుష్రా అరెస్ట్ అయ్యే సమయానికి పోస్ట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మెయిల్ ద్వారా ఓటు వేసిన వారిలో మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చౌదరి పర్వేజ్ ఎలాహి, అవామీ ముస్లిం లీగ్ చీఫ్ షేక్ రషీద్, సమాచార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కూడా ఉన్నారని అడియాలా జైలు వర్గాలు తెలిపాయి.

సైఫర్ కేసు మరవక ముందే మరో కేసులో ఇమ్రాన్ ఖాన్‌కి షాక్, తోషాకానా కేసులో పాక్ మాజీ ప్రధానితో పాటు ఆయన భార్యకు 14 ఏళ్లు జైలు శిక్ష

పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్ ఫలితాలు వచ్చాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండవ స్థానంలో ఉంటుందని, ఆ తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్‌ ఉంటుందని ఒక నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎస్‌- ఎన్‌ 115 నుండి 132 జాతీయ అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది.పంజాబ్ అసెంబ్లీలో నవాజ్ షరీఫ్ పార్టీకి పూర్తి మెజారిటీ లభిస్తుందని ఈ నివేదిక వెల్లడించింది.

ఈ ఎన్నికల్లో పీపీపీకి 35 నుంచి 40 సీట్లు వస్తాయని, పీటీఐ స్వతంత్ర అభ్యర్థులకు 23 నుంచి 29 సీట్లు రావచ్చనే అంచనాలున్నాయి. అలాగే ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్‌కు 12-14 సీట్లు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లామ్‌కు 6-8 సీట్లు, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (క్వైద్), ఇస్తేకామ్-ఏ-పాకిస్థాన్ పార్టీకి 2 సీట్లు వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.