US Visa Policy Update: అక్రమ పౌరసత్వం పొందకుండా యూఎస్ ప్రెసిడెంట్ కఠిన చర్యలు, 'బర్త్ టూరిజం' పేరుతో అమెరికాకు వచ్చే గర్భినీ స్త్రీలపై ఆంక్షలు విధించిన వైట్ హౌజ్
విదేశీయులు "అమెరికన్ గడ్డపై జన్మనివ్వడం ద్వారా తమ పిల్లలకు సాధారణంగా మరియు శాశ్వత అమెరికన్ పౌరసత్వం పొందటానికి" ఆ వీసాలను ఉపయోగిస్తున్నారని వైట్ హౌజ్ ప్రతినిధులు పేర్కొన్నారు....
Washington, January 24: అమెరికాకు అక్రమ వలసలను నియంత్రించడమే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యమైన అంశం అని, విదేశీయులకు అమెరికన్ పౌరసత్వం (American Citizenship) రద్దు చేస్తాం అంటూ గతంలో హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గర్భినీ స్త్రీలు డెలివరీ కోసం "బర్త్ టూరిజం" (Birth Tourism) పేరుతో వచ్చే వీసాలపై ఆంక్షలు విధించారు. అమెరికా చట్టాల ప్రకారం అమెరికా నేలపై పుట్టిన ప్రతీ ఒక్కరిని అమెరికన్లు గానే పరిగణిస్తారు. కొన్నేళ్ల వరకు ఆ పిల్లల బాధ్యత మరియు వారికి పౌరసత్వం ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది విదేశీయులు ఖర్చు ఎక్కువైనా సరే, అక్కడే డెలివరీ చేసుకుంటున్నారు.
దీంతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ తరహా చర్యలకు చెక్ పెడుతూ సందర్శకుల వీసాలపై ఆంక్షలు విధించారు. శుక్రవారం నుంచే ఈ విధానం అమలులోకి రానుంది. తాజా ఆదేశాల ప్రకారం తాత్కాలిక B-1 మరియు B-2 సందర్శకుల వీసాలు ఇకపై "బర్త్ టూరిజం" కోసం యునైటెడ్ స్టేట్స్ (USA) లో ప్రవేశించాలనుకునే విదేశీయులకు జారీ చేయబడవు.
విదేశీయులు "అమెరికన్ గడ్డపై జన్మనివ్వడం ద్వారా తమ పిల్లలకు సాధారణంగా మరియు శాశ్వత అమెరికన్ పౌరసత్వం పొందటానికి" ఆ వీసాలను ఉపయోగిస్తున్నారని వైట్ హౌజ్ ప్రతినిధులు పేర్కొన్నారు.
వైట్ హౌజ్ తీసుకున్న నిర్ణయం అమెరికన్లు కష్టపడి సంపాదించిన డాలర్లతో కట్టిన టాక్సులు ఈ టూరిజం పేరుతో వచ్చే వారికి ప్రత్యక్షంగానో , పరోక్షంగానో దుర్వినియోగం కాకుండా కాపాడుతుంది. బర్త్ టూరిజం ద్వారా వచ్చే విదేశీయులు ఇక్కడి విలువైన ఆసుపత్రి వనరులపై భారం వేస్తున్నారు మరియు ఫెడరల్ ప్రాసిక్యూషన్ల ప్రకారం అదొక నేరంగానే ప్రతిబించబడుతుంది. అమెరికన్ పౌరసత్వం యొక్క సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. అమెరికన్ ప్రజల సంరక్షణ, దేశ భద్రత కోసం 'ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ' లోని లోపాలకు సవరణలు చేసినట్లు వైట్ హౌజ్ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత పౌరసత్వ సవరణ చట్టం నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు, విచారణలకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు
'బి' వీసాలతో అమెరికాలో ప్రవేశించిన మహిళల ద్వారా ప్రతి ఏడాది వేలాది మంది పిల్లలు అమెరికాలో జన్మిస్తున్నారని వైట్ హౌజ్ అధికారులు గుర్తించారు.సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ ప్రకారం, 2016 - 2017 మధ్యకాలంలో “బర్త్ టూరిజం” వీసా ద్వారా వచ్చిన మహిళలు 33,000 మంది పిల్లలకు అమెరికాలో జన్మనిచ్చారు. యునైటెడ్ స్టేట్స్ లో మొత్తం వార్షిక జననాల సంఖ్య సుమారు 3.8 మిలియన్లు.
ఈ వీసాలను అడ్డం పెట్టుకొని కొన్ని సంస్థలు పెద్ద వ్యాపారమే నడిపిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకారం, కొంతమంది "బర్త్ టూరిజం" ఆపరేటర్లు యూఎస్ గడ్డపై బిడ్డ పుట్టాలని కోరుకునే మహిళల నుంచి రూ. 100,000 డాలర్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు రిపోర్ట్స్ అందాయి. ఈ నేపథ్యంలో అమెరికా పౌరసత్వంపై చట్టాలను మరింత కఠినతరం చేస్తుంది అమెరికా.