Shinzo Abe Shot: అత్యంత విషమంగా జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే ఆరోగ్యం, ఘటనను తీవ్రంగా ఖండించిన భారత ప్రధాని మోదీ, ఇది ప్ర‌జాస్వామ్యంపై దాడి అన్న పీఎం

అబే ప్రాణాల‌తో బ్ర‌తికి రావాల‌ని తాను ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు. కాల్పుల ఘ‌ట‌న‌ను (Shinzo Abe Shot) ప్ర‌ధాని కిషిదా ఖండించారు.

PM Narendra Modi Shinzo Abe. (Photo Credits: PTI | Instagram)

New Delhi, July8:  జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉన్న‌ట్లు ప్ర‌ధాని ఫుమియో కిషిదా తెలిపారు. అబే ప్రాణాల‌తో బ్ర‌తికి రావాల‌ని తాను ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు. కాల్పుల ఘ‌ట‌న‌ను (Shinzo Abe Shot) ప్ర‌ధాని కిషిదా ఖండించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న మంత్రులంద‌రూ టోక్యో చేరుకోవాల‌ని ఆదేశించారు. అయితే ఎన్నిక‌ల షెడ్యూల్‌ను మారుస్తారా లేదో తెలియ‌దు. షింజోపై అటాక్ క్ష‌మించ‌రానిద‌ని తెలిపారు.

అబే ప్రాణాల‌ను ద‌క్కించుకునేందుకు డాక్ట‌ర్లు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. దాడి ఘ‌ట‌న హేయ‌మైంద‌ని, ఏమాత్రం స‌హించ‌బోమ‌న్నారు. ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోయే వేళ ఈ దాడి జ‌రిగింద‌ని,ఇది ప్ర‌జాస్వామ్యంపై దాడి అని ఆయ‌న అన్నారు.నా ప్రియ మిత్రుడు అబే షింజోపై జరిగిన దాడితో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. మా ఆలోచనలు మరియు ప్రార్థనలు అతనితో, అతని కుటుంబంతో మరియు జపాన్ ప్రజలతో ఉన్నాయని భారత ప్రధాని మోదీ (PM Narendra Modi) ట్వీట్ చేశారు.

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబేపై ఇవాళ హ‌త్యాయ‌త్నం జ‌రిగిన సంగతి విదితమే. ఆయ‌న ఛాతిలోకి ఆగంత‌కుడు గ‌న్‌తో కాల్చాడు. నారా న‌గ‌రంలో ఉన్న ఓ వీధిలో ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌పై కాల్పులు జ‌రిగాయి. కార్డియోప‌ల్మోన‌రీ అరెస్ట్‌లో అబే ఉన్న‌ట్లు వైద్యులు చెబుతున్నారు. హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్తున్న స‌మ‌యంలో ఆయ‌న స్పృహ‌లో లేరు. షింజో అబే ఛాతి నుంచి విప‌రీతంగా ర‌క్తం కారింది. కాల్పుల‌కు పాల్ప‌డిన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు.

య‌మాటో సైదాయిజి స్టేష‌న్ ముందు ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో కాల్పులు జ‌రిగాయి. స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 11.30 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అక్క‌డ ఉన్న హై స్కూల్ విద్యార్థులు ఈ కాల్పుల్ని ప్ర‌త్య‌క్షంగా చూశారు. వెనుక నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తి త‌న వ‌ద్ద ఉన్న గ‌న్‌తో రెండు షాట్స్ కాల్చిన‌ట్లు ఆ విద్యార్థులు చెప్పారు.  క‌షిహ‌రా న‌గ‌రంలో ఉన్న నారా మెడిక‌ల్ వ‌ర్సిర‌టీకి వెంట‌నే హెలికాప్ట‌ర్ ద్వారా అబేను త‌ర‌లించారు. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తిని అరెస్టు చేసి అత‌ని వ‌ద్ద ఉన్న గ‌న్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆగంత‌కుడిని టెట్‌సుయా య‌మ‌గామిగా గుర్తించారు. నారా న‌గ‌రానికి చెందిన 41 ఏళ్ల వ్య‌క్తి అత‌ను. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న ప్ర‌ధాని ఫుమియో కిషిడా ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకుని టోక్యో చేరుకున్నారు