Uganda: ఆయనకు 12 మంది భార్యలు, 102 మంది సంతానం, నెలకోసారి భార్యలతో సమావేశమై సమస్యలపై చర్చించే పెద్దాయన, ఆయనది ఒక విచిత్ర కుటుంబం
పిల్లలను కూడా పదుల సంఖ్యలో కనలేదు.. ఏకంగా 102 మందికి తండ్రి అయ్యాడు. 578 మంది మనవళ్లు, మనవరాళ్లకు తాత (578 Grandchildren) అయ్యాడు ఆ వ్యక్తి. మరి ఆ ఘనుడి గురించి తెలుసుకోవాలంటే ఉగాండా దేశానికి వెళ్లక తప్పదు. తూర్పు ఉగాండాకు చెందిన ముసా హసహ్యా కసేరా(68) బుగిసాలో నివసిస్తున్నాడు.
Butaleja, FEB 03: ఓ వ్యక్తి ఒకట్రెండు పెళ్లిళ్లు కాదు.. ఏకంగా 12 పెళ్లిళ్లు (12 Wives) చేసుకున్నాడు. పిల్లలను కూడా పదుల సంఖ్యలో కనలేదు.. ఏకంగా 102 మందికి తండ్రి అయ్యాడు. 578 మంది మనవళ్లు, మనవరాళ్లకు తాత (578 Grandchildren) అయ్యాడు ఆ వ్యక్తి. మరి ఆ ఘనుడి గురించి తెలుసుకోవాలంటే ఉగాండా దేశానికి వెళ్లక తప్పదు. తూర్పు ఉగాండాకు చెందిన ముసా హసహ్యా కసేరా(68) బుగిసాలో నివసిస్తున్నాడు. 17 ఏండ్ల వయసులో 1972లో తొలి వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన ఏడాదికి తొలికాన్పులో సాండ్రా నాబ్వైర్ జన్మించింది. అయితే ఒక భార్యతో సుఖంగా ఉన్న అతనికి.. వంశాభివృద్ధి కోసం మరిన్ని వివాహాలు చేసుకోవాలని సోదరుడు, బంధువులు సూచించారు. వారి మాట నమ్మిన హసహ్యా (Musa Hasahya Kasera).. ఏకంగా 12 మందిని వివాహం చేసుకున్నాడు. 102 మంది పిల్లలను కన్నాడు. ఈ పిల్లలకు కూడా వివాహాలు అయ్యాయి. 578 మంది మనవళ్లు, మనవరాళ్లకు హసహ్యా తాత అయ్యాడు.
తనకున్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు హసహ్యా. పిల్లలు, మనవండ్లు ఎక్కువ కావడంతో.. కుటుంబ సభ్యులకు సరిపోయే ఆహారం, బట్టలను హసహ్యా సమకూర్చలేకపోతున్నాడు. దీంతో విసుగెత్తిపోయిన ఇద్దరు భార్యలు అతన్ని వదిలేసి వెళ్లిపోయారు. హసహ్యా చిన్న భార్య వయసు 35 ఏండ్లు కాగా, అతనికి కలిగిన సంతానంలో 10 ఏండ్ల నుంచి 50 ఏండ్ల వయసున్న వారు ఉన్నారు. వందలాది పిల్లల్లో చాలా మంది పిల్లల పేర్లు కూడా హసహ్యాకు తెలియదు.
పిల్లలను గుర్తించడంతో భార్యల సహాయం తీసుకుంటున్నాడు. హసహ్యా కుటుంబ సభ్యులంతా మట్టి గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. గడ్డితో కప్పిన ఇండ్లలోనే తలదాచుకుంటున్నారు. హసహ్యా కుమారుల్లో ఒకరైన షాబన్ మగీనో టీచర్ కావడంతో కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నాడు. కుటుంబంలో వివాదాలు, సమస్యలు వస్తే నెలకు ఒకసారి సమావేశమై పరిష్కరించుకుంటారు.