Hero Mavrick 440: బైక్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'హీరో' మోటార్‌సైకిల్ వచ్చేసింది, హార్లే-డేవిడ్‌సన్ బైక్‌కు పోటీగా హీరో మావ్రిక్ 440 ద్విచక్ర వాహనం విడుదల, ధర కూడా తక్కువే!
Hero Mavrick 440: బైక్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మావ్రిక్ మోటార్‌సైకిల్ వచ్చేసింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ ఎట్టకేలకు 'హీరో మావ్రిక్ 440' మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ బేస్, మిడ్ మరియు టాప్ అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ ద్విచక్ర వాహనం ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1.99 లక్షల నుండి ప్రారంభమవుతున్నాయి. టాప్ మోడల్ రూ. 2.24 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
మావ్రిక్ 440 అనేది ఒక నేక్డ్ స్ట్రీట్ బైక్, దీనిని హీరో వరల్డ్ 2024లో ఆవిష్కరించారు. ఇది హార్లే-డేవిడ్‌సన్ X440తో పోలికలను కలిగి ఉంటుంది. హీరో మావ్రిక్ 440 బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కస్టమర్‌లు ఏదైనా అధీకృత డీలర్‌షిప్ నుండి వాహనాన్ని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. లేదా హీరో మోటోకార్ప్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Hero Mavrick 440- ఇంజన్ సామర్థ్యం
హార్లే-డేవిడ్సన్ X440 ఉన్నట్లుగానే హీరో మావ్రిక్ 440 బైక్ లో కూడా అదే తరహా 440cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. దీనిని అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ ద్వారా 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ ఇంజన్ 27 BHP శక్తిని 36 Nm టార్కును ఉత్పత్తి చేయగలదు.
Hero Mavrick 440 డిజైన్, ఫీచర్లు
హీరో మావ్రిక్ 440 బైక్ డిజైన్ అచ్ఛంగా హార్లే-డేవిడ్‌సన్ X440 నుండి ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది. హీరో మావ్రిక్ 440 డిజైన్ పరిశీలిస్తే.. ఆకట్టుకునే స్పోర్టియర్ లుక్, దృఢమైన ఇంధన ట్యాంక్ , గుండ్రని ఆకారపు LED హెడ్‌లైట్ సెటప్, H- ఆకారపు LED DRL, సొగసైన చిన్న-పరిమాణ టర్న్ ఇండికేటర్‌లు, బార్-ఎండ్ మిర్రర్లు, చిన్న టెయిల్ సెక్షన్‌తో కూడిన సింగిల్-పీస్ సీట్ ఉన్నాయి. బేస్ వేరియంట్ స్పోక్ వీల్స్‌తో అందిస్తుండగా, టాప్-ఎండ్ మోడల్‌లలో స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ఇక, ఫీచర్ల విషయానికి వస్తే, ఈ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్, మెసేజ్ అలర్ట్‌లు మరియు USB-C ఛార్జింగ్ పోర్ట్ అందించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు.
హీరో మావ్రిక్ 440 ఎక్స్-షోరూమ్ ధరలు:
బేస్ వేరియంట్- రూ. 1.99 లక్షలు
మిడ్ వేరియంట్ - రూ 2.14 లక్షలు
టాప్ ఎండ్ వేరియంట్ - రూ. 2.24 లక్షలు
కస్టమర్లను ఆకర్షించడానికి, కంపెనీ 'వెల్‌కమ్ టు మావెరిక్ క్లబ్' అనే ఆఫర్‌ను కూడా ప్రవేశపెట్టింది, దీని కింద మార్చి 15 లోపు బైక్‌ను ప్రీ-బుక్ చేసే కస్టమర్‌లు రూ. 10,000 విలువైన మావెరిక్ కాంప్లిమెంటరీ కిట్‌ను పొందుతారు.