Shocking Facts About EVs: ఎలక్ట్రిక్ కార్లతో పర్యావరణానికి పెనుముప్పు, షాకింగ్ నిజాలు బయటపెట్టిన ఐఐటీ కాన్పూర్ నిపుణులు
ఎలక్ట్రిక్ కార్ల తయారీ, వినియోగం, వాటిని తుక్కుగా మార్చే ప్రక్రియను సంప్రదాయ, హైబ్రిడ్ కార్లతో పోల్చి చూసినప్పుడు 15 నుంచి 50 శాతం ఎక్కువ గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలవుతాయని ఐఐటీ కాన్పూరుకు చెందిన ఇంజిన్ రిసెర్చ్ ల్యాబ్ పేర్కొన్నది.
New Delhi, May 25: రోడ్లపై ఇటీవల ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు (EV) కనిపిస్తున్నాయి. నిర్వహణ ఖర్చు తక్కువ కావడం, పెట్రోలుతో పనిలేకుండా ఎంచక్కా ఇంట్లోనే చార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉండడం, ఎంత దూరమైనా చవగ్గా ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో అందరూ వీటిపై మక్కువ పెంచుకుంటున్నారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు కూడా ఈవీలపై అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో ప్రముఖ వాహన తయారీ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల (Electric Cars) తయారీపై దృష్టిసారించాయి. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంటే కాన్పూరు ఐఐటీ మాత్రం విస్తుపోయే విషయాలను వెల్లడిస్తూ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. సంప్రదాయ, హైబ్రిడ్ కార్లతో పోలిస్తే ఈవీలు (Electric Cars) ఎంతమాత్రమూ ఎకో ఫ్రెండ్లీ కాదని అధ్యయనం తేల్చి చెప్పింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ, వినియోగం, వాటిని తుక్కుగా మార్చే ప్రక్రియను సంప్రదాయ, హైబ్రిడ్ కార్లతో పోల్చి చూసినప్పుడు 15 నుంచి 50 శాతం ఎక్కువ గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలవుతాయని ఐఐటీ కాన్పూరుకు చెందిన ఇంజిన్ రిసెర్చ్ ల్యాబ్ పేర్కొన్నది. కిలోమీటరు చొప్పున విశ్లేషించినప్పుడు ఈవీల కొనుగోలు, ఇన్సూరెన్స్, నిర్వహణ వంటివి 15 నుంచి 60 శాతం ఎక్కువని స్పష్టం చేసింది.
ఈవీల కంటే సంప్రదాయ, హైబ్రిడ్ కార్లే పర్యావరణ అనుకూలమని పేర్కొన్నది. ఓ జపాన్ సంస్థతో కలిసి ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) ప్రొఫెసర్ అవినాష్ అగర్వాల్ ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వాహనాల్లోని బ్యాటరీలను చార్జింగ్ చేసేందుకు విద్యుత్ అవసరమని, ప్రస్తుతం దేశంలోని 75 శాతం విద్యుత్తు బొగ్గు నుంచి ఉత్పత్తి అవుతున్నదని ప్రొఫెసర్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కార్బన్
డయాక్సైడ్ పెద్దమొత్తంలో గాల్లోకి విడుదలవుతున్నదని తెలిపారు.