Kawasaki Ninja 500: భారత మార్కెట్‌లో సరికొత్త కవాసకి నింజా 500 బైక్ విడుదల, దీని ధర రూ 5.24 లక్షలు, ఇక ఆ మోడల్ మోటార్ సైకిల్‌ను మరిచిపోవాల్సిందే!
Kawasaki Ninja 500: జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి భారత మార్కెట్లో వరుసగా వివిధ బైక్ మోడళ్లను విడుదల చేస్తూ తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. తాజాగా 'కవాసకి నింజా 500' బైక్‌ను విడుదల చేసింది. కొత్త కవాసకి నింజా 500 బైక్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 5.24 లక్షలు. ఇప్పటికే కవాసకి సంస్థ నింజా శ్రేణిలో నింజా 300 మరియు నింజా 400 మోడళ్లను ప్రవేశపెట్టింది. అయితే నింజా 400 కంటే తాజాగా ప్రవేశపెట్టిన నింజా 500 బైక్ ఇంజన్ శక్తివంతమైనది. అయినప్పటికీ భారతీయ మార్కెట్లో వీటి ధరలు సమానంగా ఉండటం గమనార్హం. ఈ కారణంగా రాబోవు కాలంలో నింజా 400 స్థానంలో నింజా 500 బైక్ చలామణీలో ఉండే అవకాశం ఉంది.
Kawasaki Ninja 500 ఇంజన్ సామర్థ్యం
కవాసకి నింజా 500లో 451cc లిక్విడ్-కూల్డ్, సమాంతర-ట్విన్ ఇంజన్ ఉంటుంది, ఇది స్లిప్ - అసిస్ట్ ఫంక్షన్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. దీని ఇంజన్ 9,000rpm వద్ద 45hp శక్తిని 6,000rpm వద్ద 42.6Nm టార్కును విడుదల చేస్తుంది.
Kawasaki Ninja 500 ఫీచర్లు- స్పెసిఫికేషన్లు
కవాసకి నింజా 500 ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. బైక్‌కు ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపున మోనో-షాక్ ఉంది. అలాగే ఈ బైక్ స్పోర్ట్‌మ్యాక్స్ GPR-300 టైర్‌లతో 17-అంగుళాల చక్రాలపై నడుస్తుంది. బ్రేకింగ్ వ్యవస్థలో ముందు చక్రానికి 310mm డిస్క్ బ్రేక్, వెనుక చక్రానికి 220mm డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఈ బైక్ బరువు 171 కిలోలు కాగా, సీట్ ఎత్తు 785mm గా ఉంది.
ఫీచర్ల పరంగా, బైక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పూర్తిగా LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్-ఛానల్ ABS, తక్కువ బీమ్ కోసం ప్రొజెక్టర్‌తో LED హెడ్‌లైట్, అలాగే హై బీమ్ కోసం రిఫ్లెక్టివ్ LED, వెనకాల ఆకర్షణీయమైన LED టైల్‌లైట్‌లు ఉన్నాయి.
కొత్త నింజా 500 బైక్ భారతీయ రోడ్లపై అప్రిలియా RS457, KTM RC390 వంటి మోటార్ సైకిళ్లతో పోటీ పడుతుంది.
కవాసకి నింజా 500 బైక్ CBU (పూర్తిగా అసెంబ్లింగ్ చేయబడిన) గా భారతదేశానికి వస్తుంది. ఇప్పటికే ఈ బైక్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి, డెలివరీలు మార్చి 2024లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.